logo

కాంగ్రెస్‌లో చేరిన హుస్నాబాద్‌ భాజపా ఇన్‌ఛార్జి

హుస్నాబాద్‌ నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి, హౌజ్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తన అనుచరులతో కలసి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.

Published : 07 May 2024 03:30 IST

సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి, చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: హుస్నాబాద్‌ నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి, హౌజ్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తన అనుచరులతో కలసి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి భాజపా అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. కొండాపూర్‌ మాజీ సర్పంచి వంగర మల్లేశం, హుస్నాబాద్‌ పురపాలిక కౌన్సిలర్‌ స్వర్ణలత భర్త, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, కొండ సతీశ్‌, కోహెడ మండలం కూరెళ్ల మాజీ సర్పంచి గాజుల రమేశ్‌, మండల పార్టీ కార్యదర్శి గాజుల వేంకటేశ్వర్లు తదితరులకు కాంగ్రెస్‌ కండువా కప్పారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. చేరిన వారంతా కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీని కలిశారు.

షరామామూలే.. ఫిరాయింపులే!

హుస్నాబాద్‌ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. 2019, 2024 కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్‌ సెగ్మెంటు రాజకీయాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. గత నవంబరులో భాజపా నుంచి హుస్నాబాద్‌ శాసనసభ స్థానానికి పోటీ చేసిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారు. వారం క్రితం వరకు కరీంనగర్‌ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ కోసం ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్‌ నామపత్రాల దాఖలు ర్యాలీ కార్యక్రమంలోనూ ఉన్నారు.

నాడు అల్గిరెడ్డి.. నేడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి..

నామినేషన్ల కార్యక్రమం ముగిసిన తర్వాత నేడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి పార్టీ మారగా నాడు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అదే పని చేశారు. 2019 ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ పోటీ చేశారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆయనకు మద్దతుగా ఉన్నారు. ప్రభాకర్‌ నామినేషన్‌ తర్వాత ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ వదలి తన అనుచరులతో కలిసి భారాసలో చేరి ప్రచారం చేశారు. అప్పుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అన్నీ తానై ప్రచారాన్ని చేపట్టారు. పార్టీ ఇన్‌చార్జిగా కార్యక్రమాలు నిర్వహించి.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తానే అంటూ ప్రచారం చేసుకున్నారు. అప్పటికే భారాసలో ఉన్న అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరారు. ఆయన చేరికపై శ్రీరాంచక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బొమ్మ శ్రీరాంచక్రవర్తి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. కాంగ్రెస్‌లో చేరేటపుడు లోక్‌సభ స్థానానికి టికెట్‌ అవకాశం కల్పిస్తామన్న అధిష్ఠానం.. ప్రవీణ్‌రెడ్డికి ఇవ్వకపోవడంతో ఆయన ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్‌, ఎల్కతుర్తి మండలాల్లోని మాజీ ప్రజాప్రతినిధులు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వీరి చేరికలతో పార్టీకి బలం చేకూరుతుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని