logo

అత్యవసరమైతేనే బయటకు రండి

జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published : 07 May 2024 03:42 IST

జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవితో ‘న్యూస్‌టుడే’
సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే

జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవితో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆమె వెల్లడించిన వివరాలు..

వైద్యారోగ్యశాఖ అప్రమత్తం

జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి అత్యవసరమైతే మినహా సెలవులు లేవు. ఎన్నికల విధులు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజలకు ఎండల తీవ్రత కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించాం. సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ఉప వైద్యాధికారులు, డివిజన్‌ స్థాయి, ఆరోగ్య, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య బృందాలు ఏర్పాటు చేశాం. వీరిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో నలుగురు అధికారులను నియమించాం. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ప్రజలు 94948 51165, డయల్‌ 100, 108కి ఫోన్‌చేసి సహాయం పొందొచ్చు.

మందుల కొరత లేదు

ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు అన్ని రకాల మందులు సరిపడా ఉన్నాయి. ఇప్పటికే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా ఎండల వల్ల కలిగే నష్టాలపై పల్లెలు, పట్టణాల్లో ఇంటింటా అవగాహన కల్పించాం. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులు, ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం రెండు లక్షల ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి బొండాలు తీసుకోవాలి. నిల్వ చేసిన ఆహార పదార్థాలు, వేపుడు పదార్థాలు తినవద్దు. తలనొప్పి, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి.

ప్రయాణాలు తగ్గిస్తే మేలు

ఎండలో ప్రయాణించడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌ బారినపడే అవకాశం ఉంటుంది. ప్రజలకు తప్పనిసరైతేనే ఎండలో బయటకు రావాలి.. ప్రయాణాలు తగ్గించాలి. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, రైతులు పనులకు వెళ్లినప్పుడు తలకు రుమాలు కట్టుకోవాలి. లేదంటే టోపీ ధరించాలి. మధ్యాహ్నం తర్వాత కూడా ఎండలో పనిచేస్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని