logo

అధినేత యాత్రపై ఆశలు

సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్‌ స్థానమైన మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు,

Updated : 07 May 2024 06:06 IST

మెదక్‌లో నేడు భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ రోడ్‌షో

మెదక్‌, నర్సాపూర్‌: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్‌ స్థానమైన మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు మెతుకుసీమలో పర్యటించనున్నారు. అధినేత పర్యటన కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 2004 నుంచి భారాస పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. సొంత జిల్లా కావడంతో కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వరుసగా ఐదుసార్లు (ఉప ఎన్నికతో) కలిపి ఈ స్థానాన్ని భారాస తన ఖాతాలో వేసుకుంది. ఆరోసారి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఆరుగురు భారాస ఎమ్మెల్యేలుండడం, ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట జిల్లాలో పట్టువుండడం   కలిసివస్తోందని భారాసభావిస్తోంది. ఈక్రమంలో శ్రేణుల్లో జోష్‌ నింపేందుకు అగ్రనేత పర్యటిస్తున్నారు.  

పర్యటన ఇలా...: కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో రోడ్డుషో ముగించుకొని రామాయంపేట మీదుగా రాత్రి 7 గంటలకు మెదక్‌కు చేరుకుంటారు. స్థానిక ర.భ. అతిథిగృహం నుంచి పార్టీ శ్రేణులు ర్యాలీగా బయల్దేరి రాందాస్‌ చౌరస్తా వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజలనుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. రాత్రి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి, మరుసటి రోజు బుధవారం సాయంత్రం నర్సాపూర్‌లోని అంబేడ్కర్‌ కూడలి వద్ద జరిగే కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. 10న సిద్దిపేటలో జరిగే రోడ్డుషోలో కేసీఆర్‌ పాల్గొనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని