logo

హామీల అమలులో మాట తప్పిన సీఎం

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి  ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 07 May 2024 03:53 IST

ములుగులో మాట్లాడుతున్న హరీశ్‌రావు, చిత్రంలో ప్రతాప్‌రెడ్డి , వెంకట్రామిరెడ్డి

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి  ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్‌లో బుధవారం మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌షో విజయవంతం చేసేందుకు, పట్టణంలోని ఓ వేడుక మందిరంలో ముఖ్యనేతలతో సోమవారం ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ నాయకులు ఇచ్చిన బాండ్‌ పేపర్లు బౌన్స్‌ అయ్యాయని ఎద్దేవా చేశారు. పుట్టినగడ్డ మెదక్‌ నుంచి కేసీఆర్‌ తెలంగాణ ప్రతేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి సాధించారని, ఈ జిల్లా అబివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన్ని అవమానిస్తూ మాట్లాడుతున్న వారికి మెదక్‌ జిల్లా ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలను భారాస సాకారం చేస్తే, కాంగ్రెస్‌ వాటిని రద్దుచేస్తామని అంటోంది, జిల్లాలు వద్దనుకునే వారు కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు, కావాలని కోరుకునేవారు భారాసను గెలిపించాలన్నారు. పదేళ్ల పాలనలో భాజపా ఏం చేశామనేది చెప్పడం లేదు, ఐదు నెలల పాలనలో కాంగ్రెస్‌ కూడా చేసింది చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు అబద్ధాలతో పుట్టిన కవలపిల్లలు. ప్రజలకిచ్చిన హామీలపైన చర్చ పెట్టకుండా, మతం పేరుతో ఒకరు, రిజర్వేషన్ల పేరుతో మరొకరు సెంటిమెంట్‌తో లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర నాయకులు గోపి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు మన్సూర్‌, పుర అధ్యక్షులు అశోక్‌గౌడ్‌, బోగశేఖర్‌ పాల్గొన్నారు.

ములుగు: కాంగ్రెస్‌ పార్టీతో ప్రమాదం పొంచి ఉందని హరీశ్‌రావు అన్నారు. వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ములుగులో కార్నర్‌ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తేసిందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని