logo

పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు

పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్‌ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated : 08 May 2024 06:04 IST

నిందితుడి రిమాండు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ దిలీప్‌కుమార్‌

మెదక్‌, న్యూస్‌టుడే: పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్‌ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ దిలీప్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరపురికాలనీకి చెందిన ఆముదా రఘు పోలీసుల పేరు చెప్పి మెదక్‌లో ఇసుక, ఇతర వ్యాపారులను బెదిరిస్తున్నాడు. చేతిలో లాఠీ పట్టుకొని వారిని వెంబడించడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నాడు. పోలీసులు, ఎమ్మెల్యే పేర్లు చెప్పి.. సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడితో సత్సంబధాలు ఉన్నాయంటూ ఉన్నతాధికారుల నంబర్లను సేకరించాడు. సొంతంగా వాట్సప్‌ సమూహం ఏర్పాటు చేశాడు. ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ వారికి ఫోన్‌ చేస్తున్నట్టు నటిస్తూ వ్యాపారుల నుంచి డబ్బులు దోపిడీ చేస్తున్నాడు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడి వారిపై అజమాయిషీ చేస్తూ డబ్బులు డిమాండ్‌ చేసేవాడు. మాట వినని అధికారులపై ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడు. పోలీసుల పేర్లు చెబుతూ, పోలీసుగా నటిస్తూ అమాయకులైన వారిని బెదిరించి దౌర్జన్యంగా డబ్బులు డిమాండు చేస్తున్న రఘును మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇతడిపై హైదరాబాద్‌అఫ్జల్‌గంజ్‌లో అత్యాచారం, మెదక్‌ పట్టణంలో ఏడు కేసులు, హవేలిఘనపూర్‌ ఠాణాలో ఒక దోపిడీ కేసు నమోదైందని సీఐ వివరించారు.


పంక్చరైన టైరు.. వంతెన గోడను ఢీకొన్న వ్యాను
వృద్ధుడి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

జోగిపేట: వ్యాను టైరు పంక్చరై అదుపు తప్పి వంతెన గోడను ఢీకొనడంతో వృద్ధుడు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలైన ఘటన అందోలు మండల పరిధిలో జరిగింది. జోగిపేట ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. పెద్దశంకరంపేటకు చెందిన సంగయ్యగౌడ్‌(60).. ఆయన భార్య అంజమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంగళవారం ఉదయం వ్యాన్‌లో కుమార్తెలు మంజుల, మానస, కుమారుడు అరవింద్‌గౌడ్‌తో పాటు మరొకరితో కలిసి సంగారెడ్డికి బయలుదేరారు. అందోలు మండలం అల్మాయిపేట, చౌటకూరు మధ్య వంతెన వద్దకు రాగానే వ్యాన్‌ ముందు టైరు పంక్చరైంది. దీంతో అదుపు తప్పి వంతెన గోడను బలంగా ఢీకొనడంతో సంగయ్యగౌడ్‌, అంజమ్మ, మంజుల, మానస, అరవింద్‌గౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారి వెంట ఉన్న మరొకరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. సంగయ్యగౌడ్‌ మార్గమధ్యలోనే మృతిచెందాడు. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌ తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.


నిలిపిన ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు..

హత్నూర, న్యూస్‌టుడే: రోడ్డు మీద నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. హత్నూర మండలం గోవింద్‌రాజ్‌పల్లి శివారులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్‌ తెలిపిన వివరాలు.. హత్నూర మండలం నవాబుపేటకు చెందిన డప్పు వెంకట్‌(21), గోవింద్‌రాజ్‌పల్లికి చెందిన సుమన్‌, నర్సింహులు స్నేహితులు. సోమవారం సుమన్‌ పుట్టిన రోజు కావడంతో ముగ్గురు స్నేహితులు దౌల్తాబాద్‌లో ఫ్లెక్సీ సిద్ధం చేసుకొని ద్విచక్ర వాహనంపైన తిరిగి వస్తూ గోవింద్‌రాజ్‌పల్లిలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. వెంకట్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుమన్‌, నర్సింహులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సుమన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రేమించిన యువతి దక్కలేదన్న బాధలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మనోహరాబాద్‌కు చెందిన మహ్మద్‌ పాషా, సమీనాబేగం దంపతులకు కొడుకు సోహెల్‌(24), ఒక కుమార్తె ఉన్నారు. సోహెల్‌ ఆటో నడుపుతాడు. కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇందుకు ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ముభావంగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశాడు. అందరూ వేర్వేరుగా నిద్రించారు. రాత్రి సమయంలో వచ్చిన శబ్దంతో నిద్ర లేచిన కుటుంబసభ్యులు గదిలో చూడగా సోహెల్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు తండ్రి పాషా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.


హత్య కేసులో మహిళకు జీవితఖైదు

నర్సాపూర్‌: సహజీవనం సాగిస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ఓ మహిళకు జీవితఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద మంగళవారం తీర్పునిచ్చారని ఎస్పీ బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంటకు చెందిన బత్తిని పద్మ, ఇదే గ్రామానికి చెందిన శివ(26)తో సహజీవనం సాగిస్తోంది. వీరిద్దరు 2019లో డబ్బు విషయమై గొడవపడ్డారు. దీంతో కక్షగట్టిన పద్మ.. శివను దారుణంగా హత్యచేసింది. అప్పట్లో హతుడి తల్లి వసంత ఫిర్యాదుతో సీఐ నాగయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన నాయమూర్తి లక్ష్మీశారద ఈ కేసులో నిందితురాలైన పద్మకు జీవితఖైదుతో పాటు, రూ.15 వేల జరిమానా విధించారని ఎస్పీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు