logo

కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు

‘కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్‌ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం.

Published : 08 May 2024 03:16 IST

‘దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో’ చెల్లుతుందా?

 భారాస అధినేత కేసీఆర్‌

 

కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న కేసీఆర్‌, పక్కన వెంకట్రామి రెడ్డి

న్యూస్‌టుడే, మెదక్‌, మెదక్‌ టౌన్‌, మెదక్‌ రూరల్‌: ‘కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్‌ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. కాళేశ్వరం నీళ్లతో హల్దీ ప్రాజెక్టును నింపాం... మంజీరా, హల్దీపై చెక్‌డ్యాంల నిర్మించి పొలాలను పండించామని, ఈ రెండు ఎండిపోకుండా కాపాడుకున్నామని’ భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. మంగళవారం  రాత్రి మెదక్‌లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రాందాస్‌చౌరస్తాలో ప్రజలనుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. మెదక్‌ పట్టణ కేంద్రంగా జిల్లా, రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామని, మెదక్‌లో ప్రభుత్వ వైద్యకళాశాలను మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వకపోగా, పాత ప్రభుత్వంలో మంజూరు చేసిన వాటిని రద్దు చేస్తోందని విమర్శించారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేస్తున్న మరో ఇద్దరు అభ్యర్థులు గురించి నేను చెప్పేది ఏమీ లేదు... మీకు తెలుసని పేర్కొన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడేవన్ని అబద్ధాలేనని విమర్శించారు. దుబ్బాకలో చెల్లని నోటు... మెదక్‌ పార్లమెంట్‌లో చెల్లుతదా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులకోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆయనను గెలిపించాలని కోరారు. మీటింగ్‌ అనంతరం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.

శ్రేణుల్లో ఉత్సాహం

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మెదక్‌లో మంగళవారం భారాస నిర్వహించిన రోడ్‌షో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. సాయంత్రం 7.30 గంటలకు రావాల్సిన కేసీఆర్‌ మెదక్‌కు రాత్రి 9.20కు చేరుకున్నారు. దాదాపు  18 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. రోడ్‌షోలో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

ఆరు గ్యారంటీల అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రూ.4వేలు పింఛన్‌ ఖాతాలో పడిన వారు, కాంగ్రెస్‌కు, పడని వారు భారాసకు ఓటు వేయాలని, రూ.4వేలు ఇప్పించే విషయమై తాను అసెంబ్లీలో జిమ్మెదార్‌ తీసుకుంటానని పేర్కొన్నారు. పదిహేనురోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. భాజపాకు ఓటు వేస్తే నీళ్లు లేని బావిలో పడినట్టేనని విమర్శించారు. మోదీ హయంలో గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయని, 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.

ఐదు హామీలు నెరవేరుస్తా: భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

పదకొండు ఏళ్ల పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అధికారిగా పనిచేశానని, ఎంత చేసినా ఈ గడ్డ రుణం తీర్చుకోలేనని భారాస మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజాసమస్యలు తనకు తెలుసనని, అభ్యర్థులను బేరీజు వేసుకొని, విషయ పరిజ్ఞానం ఉన్న, ప్రజాపాలన తెలిసిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో గెలిచాక తాను ఇచ్చిన ఐదు హమీలను అమలు చేస్తానని స్పష్టం చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు