logo

జిల్లాకు కేసీఆర్‌ చేసిందేమీ లేదు: మంత్రి సురేఖ

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Published : 09 May 2024 01:14 IST

రాహుల్‌గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావు, మదన్‌రెడ్డి, రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారని.. ఆమె కృషి వల్లే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పడి.. ఎంతోమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించాయని పేర్కొన్నారు. నర్సాపూర్‌లోని వెల్దుర్తి వెళ్లే మార్గంలో నిర్వహించే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇదే జిల్లాకు చెందిన కేసీఆర్‌ పదేళ్లు సీఎంగా ఉండి మెదక్‌కు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. కేంద్రంలో వారి ప్రభుత్వం ఉన్నా.. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు నయాపైసా సాధించలేక పోయారని అన్నారు. కలెక్టర్‌గా పనిచేసిన భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేదల భూములు లాక్కొని, వారిని హింసించి, కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడి.. రూ.కోట్ల సంపాదించి, కేసీఆర్‌కూ కూడబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి బలహీన వర్గానికి చెందిన నీలం మధుకు టికెట్‌ ఇచ్చామని, ఆయన నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులు మెదక్‌ జిల్లాకు చెందిన వారు కావడంతో ఇక్కడ గట్టిపోటీ నెలకొందని, ఎలాగైనా మెదక్‌ సీటు ఈసారి కాంగ్రెస్‌దేనని అన్నారు. ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో రెండు సార్లు పర్యటించి వెళ్లారని, తిరిగి ఈనెల 10న పటాన్‌చెరు వస్తున్నారని అన్నారు.

సభ జయప్రదం చేయండి: నర్సాపూర్‌లో నిర్వహిస్తున్న రాహుల్‌ గాంధీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిపించి.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. ఏఐసీసీ పరిశీలకుడు, కేరళ ఎంపీ సురేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి, ప్రోగాం బాధ్యులు విశ్వనాథన్‌ ఉన్నారు.

రాహుల్‌ గాంధీ సభకు భారీ ఏర్పాట్లు

నర్సాపూర్‌: గతంలో తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్‌లో గురువారం నిర్వహిస్తున్న బహిరంగ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్‌, సంగారెడ్డి, నర్సాపూర్‌, దుబ్బాక, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనాలను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 50వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నర్సాపూర్‌లో వెల్దుర్తి వెళ్లే మార్గంలో నిర్వహిస్తున్న సభకు రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌లో సాయంత్రం 4గంటలకు వస్తారని నేతలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు