logo

గోదావరి దరి చేరాలంటే..గులాబీ గుబాళించాలి

నర్సాపూర్‌ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 09 May 2024 05:52 IST

నర్సాపూర్‌లో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

నర్సాపూర్‌లో కార్నర్‌ మీటింగ్‌కు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్‌, చిత్రంలో వెంకట్రామిరెడ్డి

నర్సాపూర్‌, నర్సాపూర్‌ రూరల్‌, శివ్వంపేట, న్యూస్‌టుడే: నర్సాపూర్‌ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నర్సాపూర్‌ పట్టణం ప్రధాన కూడలిలో మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా, బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రాంతానికి గోదావరి నీటిని సాగు అవసరాలకు ఇవ్వడం నా కల, కాలువలు పూర్తయి, మల్లన్న సాగర్‌ నుంచి జలం రావడం మొదలైతే నర్సాపూర్‌ బంగారు తునక అవుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇది సాకారం కావాలంటే  వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. తాగు నీటిని సరఫరా చేసేందుకు సిద్దిపేట జిల్లా కోమటిబండ నుంచి ప్రత్యేక లైన్‌ వేయించా, ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది.. అవి పూర్తయితే గోదావరి నీరందుతుందని స్పష్టం చేశారు. నర్సాపూర్‌ పురపాలిక అభివృద్ధికి రూ.25 కోట్లు ఇస్తే, వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం వాపస్‌ తీసుకుందని.. గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులను కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొల్చారంలో ప్రముఖ కవి మల్లినాథసూరి పేరుతో   విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందుకోసం ప్రయత్న చేయడం లేదని విమర్శించారు. భారాస ప్రభుత్వ హయాంలో మంజీరా నదిపై 10 చెక్‌డ్యాంలు నిర్మించాం. వాటి ద్వారా రైతులు సిరులు పండిస్తున్నారన్నారు.  

గజ్వేల్‌ వద్ద అభివాదం చేస్తున్న కేసీఆర్‌

పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం...: కేసీఆర్‌ రోడ్‌షో విజయవంతం కావడంతో భారాస శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నర్సాపూర్‌కు సాయంత్రం ఐదు గంటలకు రావాల్సిన కేసీఆర్‌ 7గంటలకు వచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలు భవనాలపైన, హోర్డింగ్‌లపై నిల్చుని వీక్షించారు. ట్రాఫిక్‌లో రోడ్డుపై చిక్కుకున్న వాహనాలపైనా నిల్చుని ప్రసంగాన్ని విన్నారు. అంతకుముందు కళాకారులు పాటలతో ఉత్సాహపర్చారు. కార్నర్‌ మీటింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఒక్కరే ప్రసంగించారు. సమావేశం ముగిసిన అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు వెెళ్లారు.

ప్రజలకు నమస్కరిస్తున్న హరీశ్‌రావు

మదన్‌రెడ్డి పార్టీ మారడం అవసరమా..

భారాసలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఎక్కడికి పోయారు? మీ అందరికీ నా చరిత్ర, మదన్‌రెడ్డి చరిత్ర తెలుసు. తెలుగుదేశంలో ఉండగా రెండు సార్లు ఆయనకు టికెట్‌ ఇపి‡్పంచా.. ఓడిపోయారు. భారాసలో రెండుసార్లు ఎమ్మెల్యేను చేశానన్నారు. 75 ఏళ్ల వయసులో ‘ముసలి తనానికి కుసుమ గుడాలు’ అన్నట్లుగా..ఆయన పార్టీలు మారడం అవసరమా? ఏం చేద్దామని ఆ పార్టీలో చేరాడని ప్రశ్నించారు. ఆయన చేసింది న్యాయమేనా? మీరే చెప్పాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ మెడలు వంచి, వారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలంటే పార్లమెంట్‌లో ప్రజల గొంతుకను వినిపించాలంటే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలత గౌడ్‌,  రాష్ట్ర నాయకులు ఫారూక్‌హుస్సేన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌, యు.దేవేందర్‌రెడ్డి, గోపి, జడ్పీకో-ఆప్షన్‌ సభ్యులు మన్సూర్‌, పురపాలిక అధ్యక్షులు అశోక్‌గౌడ్‌, పార్టీ మండలాధ్యక్షులు బోగశేఖర్‌ పాల్గొన్నారు. 

హోర్డింగ్‌లపై నిల్చొని ప్రసంగం వింటూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు