logo
Published : 02/12/2021 06:13 IST

అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వివాహిత ఆత్మహత్యాయత్నం


ఉప్పలపహాడ్‌లో ఆత్మహత్యకు యత్నిస్తున్న సోని

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: మద్యానికి బానిసైన తన భర్త నుంచి ఎవరికీ తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారంటూ అతని భార్య పురుగు మందు డబ్బా పట్టుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తి ఇంటి ఎదుట బలవన్మరణానికి యత్నించిన ఘటన ఆత్మకూరు మండలం ఉప్పలపహాడ్‌లో బుధవారం చోటుచేసుకుంది. తన నానమ్మ లోడె బుచ్చమ్మ నుంచి తన భర్త లగ్గాని రమేష్‌కు గతంలో 3.21 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చిందని బాధితురాలు లగ్గాని సోని తెలిపారు. తన భర్త రమేశ్‌ మద్యానికి బానిసకావడంతో తమ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ఏనుగు ప్రతాప్‌రెడ్డి ఇటీవల మాకు తెలియకుండా.. కనీసం ఒక్క రూపాయీ ఇవ్వకుండా గత సోమవారం ఆత్మకూరు తహసీల్‌ కార్యాలయంలో 3.21 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని ఆమె ఆరోపించారు. ఇదే భూమి విషయంలో తన భర్తకు, అమ్మవారి కుటుంబ సభ్యుల మధ్య వివాదం కోర్టులో ఉందని తహసీల్దార్‌కు తెలిపినా రిజిస్ట్రేషన్‌ చేశారని చెప్పారు. పురుగు మందు తాగేందుకు ఆమె యత్నించగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. ‘సమస్య పరిష్కరించేందుకు ప్రతాప్‌రెడ్డితో చరవాణిలో మాట్లాడగా తాను ఆసుపత్రిలో ఉన్నానని, త్వరలో గ్రామానికి వచ్చి మాట్లాడుతాన’ని చెప్పినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ‘కొత్త ఆర్వోఆర్‌ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేశామని, కోర్టు నుంచి ఎలాంటి స్టే, ఇంజెక్షన్‌, తీర్పు ఉత్తర్వులు లేనందున, పట్టేదారు స్వయంగా రావడంతో రిజిస్ట్రేషన్‌ చేశామ’ని తహసీల్దార్‌ పి.జ్యోతి తెలిపారు.


మహిళ మృతిపై ఆందోళన

గరిడేపల్లి, న్యూస్‌టుడే: ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేసిన ఘటన మండలంలోని గానుగబండలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల ఆనారోగ్యానికి గురైంది. చికిత్స నిమిత్తం స్థానిక ఆర్‌ఎంపీˆ వద్దకు వెళ్లగా నయం చేస్తానని నెలరోజుల పాటు ఖమ్మం ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా తిరిగిన నయం కాకపోవడంతో బుధవారం ఆమె మృతిచెందింది.  సకాలంలో వైద్యం అందించడంలో ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం చేయడంతోనే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ గ్రామంలో ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని ఆర్‌ఎంపీˆ ఇంటి ముందు ఉంచి అరగంటకుపైగా ధర్నా చేపట్టారు. ఈ విషయంలో గ్రామ పెద్దలు చొరవ తీసుకుని మృతురాలి కుటుంబానికి ఆర్‌ఎంపీ సాయం అందించే విధంగా ఒప్పందం చేయడంతో సమస్య సద్దుమనిగింది. గొడవ జరుగుతుందని గ్రామస్థులు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న చోట బందోబస్తు నిర్వహించారు. ఈ ఘటనపై బాధితుల నుంచి తమకు ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపారు.


ఆర్థిక ఇబ్బందులతో కూలీ బలవన్మరణం
భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో కూలీ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని బస్వాపురం గ్రామంలో చోటుచేసుకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉడుత స్వామి(38) కూలీ పని చేసేవారు. స్వామికి ఆరేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. స్వామి ఆరోగ్యం బాగు చేయించేందుకు అతని తండ్రి కిష్టయ్య ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఆరోగ్యం కుదుటపడలేదు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందగా, ఆరు నెలల కిందట తండ్రి కిష్టయ్య కొవిడ్‌తో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.

 


రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

కట్టంగూరు, న్యూస్‌టుడే: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన అనుములపురి నాగేందర్‌(29) గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై బుధవారం నార్కట్‌పల్లికి వెళుతుండగా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం పరిధి చౌళ్లగూడెం సమీపంలో తన వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును బలంగా ఢీకొంది. దీంతో నాగేందర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబెషనరీ ఎస్సై మేఘన తెలిపారు. మృతదేహానికి నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని