logo

దిక్కూమొక్కులేని వసతులు

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్‌పహాడ్‌ దర్గా సన్నిధి వసతుల లేమితో సతమతమవుతోంది. మొక్కులు తీర్చుకోవటానికి కనీస సౌకర్యాలు లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 18 Jan 2022 02:40 IST

సైదన్న సన్నిధిలో శాశ్వత సౌకర్యాలు కరవు ●

ఇబ్బందులు పడుతున్న భక్తులు

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే

జాన్‌పహాడ్‌ దర్గా వద్ద శిథిలమైన వసతి గృహాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్‌పహాడ్‌ దర్గా సన్నిధి వసతుల లేమితో సతమతమవుతోంది. మొక్కులు తీర్చుకోవటానికి కనీస సౌకర్యాలు లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వక్ఫ్‌బోర్డ్‌కు ఆదాయార్జనపై ఉన్న శ్రద్ధ వసతుల కల్పనపై లేదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. దర్గాను సందర్శించే మహిళలు ఆరుబయటే స్నానమాచరించాల్సిన దుస్థితి నెలకొంది. వసతిగృహాలు లేక చెట్ల కింద, రహదారుల వెంట వంటలు చేసుకొని తినాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు.

27 నుంచి ఉర్సు ఉత్సవాలు

ఏటా జనవరి మూడో గురు, శుక్ర, శనివారాల్లో ఉర్సు ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది నాలుగో శుక్రవారం జరుపుకోవాలని వక్ఫ్‌బోర్డు అధికారులు నిర్ణయించి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 27 నుంచి మూడు రోజులు పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 28న నిర్వహించే ప్రధాన ఘట్టం పవిత్ర గంధం ఊరేగింపునకు తెలుగు రాష్ర్ట్రాల నుంచి సుమారు లక్షన్నరకు పైగా భక్తులు హాజరవుతుంటారు.

స్నానపు గదులు నిర్మించలేరా?

దర్గాను సందర్శించే భక్తులు తప్పనిసరిగా పవిత్ర సఫాయి బావి వద్ద స్నానమాచరించటం సంప్రదాయం. ఈ బావి వద్ద శిథిలమైన స్నానపు గదులతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయటే స్నానం చేసి దుస్తులు మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శాశ్వత శౌచాలయాలు లేకపోవటంతో ఆరుబయట బహిరంగ మల విసర్జన జరుగుతుండటంతో దర్గా పరిసరాలు దుర్గంధభరితమవుతున్నాయి. శాశ్వత మంచినీటి సదుపాయం లేకపోవటంతో కందూరు చేసి మొక్కులు తీర్చుకొనే భక్తులు ప్రైవేటు తాగునీటి శుద్ధికేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. భక్తులు భోజనాలు చేసిన తర్వాత వదిలేసిన విస్తర్లు, మిగిలిపోయిన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోసినా వాటిని తొలగించటానికి సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవటంతో అపరిశుభ్రత తాండవిస్తుంది. ప్రతి శుక్రవారం దర్గాను సందర్శించే భక్తులు గురువారం రాత్రికే అక్కడకు చేరుకొని బాబాను దర్శించుకుంటారు. రాత్రిపూట నిద్రించేవారి సౌకర్యార్థం కనీసం రేకుల షెడ్లు నిర్మించాలనే ఆలోచన వక్ఫ్‌బోర్డుకు ఎందుకు రావటం లేదని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.

వసతిగృహాలెక్కడ..?

జాన్‌పహాడ్‌ దర్గాలో ప్రతి శుక్రవారం కందూరు నిర్వహించి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. భక్తులు వసతిగృహాలు లేక ఆరుబయట చెట్ల కింద నిద్రించి అక్కడే వంటలు చేసుకోవాల్సిన దుస్ధితి నెలకొంది. దశాబ్దాల క్రితం నిర్మించిన వసతిగృహాలు శిథిలమవటం, మరికొన్ని నివాసయోగ్యంగా లేకపోవటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఆదాయం జాస్తి.. వసతులు నాస్తి

గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే గుత్తేదారుల వేలం పాటల ద్వారా సుమారు రూ.5- 7 కోట్ల ఆదాయం వక్ఫ్‌బోర్డుకు లభించింది. ఈ ఏడాది వేలం పాట ద్వారా రూ.1.52 కోట్ల నగదును గుత్తేదారు వక్ఫ్‌బోర్డుకు చెల్లించారు. ఇందులో సగం నిధులు ఖర్చు చేసినా శాశ్వత సౌకర్యాలు ఒనగూరుతాయని భక్తులు చెబుతున్నారు.


చెత్తాచెదారంతో నిండిన సఫాయి బావి

సఫాయి బావి పవిత్రత ఏదీ?

దర్గాను సందర్శించే భక్తులు తప్పనిసరిగా స్నానమాచరించటానికి ఉపయోగించే సఫాయి బావి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చెత్తాచెదారం, వాడిపడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు బావిలో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న నీటిని తోడేసి బావిని శుభ్రపరచాలని భక్తులు కోరుతున్నారు.


ప్రతిపాదనలు పంపించాం

షేక్‌ మహమూద్‌, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌

దర్గా వద్ద శాశ్వత వసతుల కల్పనకు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని