logo

సేవకో ధర.. పర్యవేక్షణ అరకొర

భువనగిరికి చెందిన తుక్కాపురం జహంగీర్‌ శనివారం తన టాటా ఏసీ వాహనం రోడ్డు రవాణా పన్ను చెల్లించేందుకు పాత బస్టాండులో మీసేవ కేంద్రానికి వెళ్లారు. సాధారణంగా వాహన పన్ను రూ.1060, డిపార్ట్‌మెంట్‌ ఛార్జీ రూ.50 కలిపి మొత్తం రూ.1,110

Published : 01 Aug 2022 03:57 IST

భువనగిరి, భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే

భువనగిరి పట్టణంలోని మీసేవ కేంద్రం
 

భువనగిరికి చెందిన తుక్కాపురం జహంగీర్‌ శనివారం తన టాటా ఏసీ వాహనం రోడ్డు రవాణా పన్ను చెల్లించేందుకు పాత బస్టాండులో మీసేవ కేంద్రానికి వెళ్లారు. సాధారణంగా వాహన పన్ను రూ.1060, డిపార్ట్‌మెంట్‌ ఛార్జీ రూ.50 కలిపి మొత్తం రూ.1,110 చెల్లించాలి. నిర్వాహకులు మాత్రం అదనంగా పది రూపాయలు తీసుకొని రూ.1,110కి రసీదు మాత్రమే ఇచ్చారు. రుసుం పట్టికలో యూజర్‌ సర్వీస్‌ ఛార్జీలు లేవని పొందుపర్చారు. కానీ, రోడ్డు రవాణా పన్నుకు మాత్రం అదనంగా రూ.పది వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.

జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో వివిధ సేవల నిమిత్తం నిర్దేశించిన ధరల కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. ఏ సేవకు ఎంత రుసుం తీసుకోవాలో అధికారులు నిర్ణయించారు. కానీ, అందుకు భిన్నంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చాలా చోట్ల ధరల పట్టిక కనిపించటం లేదు. పౌరులకు కావాల్సిన వివిధ ధ్రువపత్రాలు, ఆన్‌లైన్‌ సేవలు, బిల్లుల చెల్లింపులు తదితర సేవల కోసం మీసేవ కేంద్రాలకు వెళ్తే నిర్దేశించిన రుసుం కంటే రూ.10 నుంచి రూ.50 వరకు దండుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్దేశిత రుసుం వసూలు అమలు కావటం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

మీసేవ కేంద్రంలో ధరలు లేని పట్టిక

కనిపించని ఫిర్యాదు సమాచారం
జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో 69 మీసేవ కేంద్రాలున్నాయి. వీటిలో రోజుకు సగటున సుమారు 800 నుంచి వెయ్యి మంది వరకు వివిధ రకాల సేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు. అత్యధికంగా సంస్థాన్‌ నారాయణపురంలో తొమ్మిది, భువనగిరి పట్టణంలో ఆరు కేంద్రాలున్నాయి. ఆర్టీఏ కార్యాలయం భువనగిరిలోనే ఉండటంతో ఈ సేవలకు సంబంధించిన కార్యకలాపాలు అధికంగా సాగుతున్నాయి. ఆదాయం, కులం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భూములకు సంబంధించిన పహాణీలతోపాటు వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర కార్యకలాపాలకు ప్రజలు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రతి పనికి సంబంధించిన నిర్ణీత రుసుం వసూలు చేసి రసీదు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో సేవకు నిర్ణీత గడువులోగా పత్రాలు అందజేయాలి. ఎక్కువగా ఆధార్‌తోపాటు కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువపత్రాలు, పహాణీలు, వివిధ పన్నుల చెల్లింపులకు అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. అధికంగా డబ్బులు తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా వినియోగదారులకు తెలియటం లేదు. ప్రతి మీసేవ కేంద్రంలో ఏ సేవకు ఎంత రుసుం చెల్లించాలో, అసౌకర్యానికి గురైతే ఫిర్యాదు చేయడానికి అధికారు చరవాణి సంఖ్యను తెలిపే పట్టికను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
-సాయి, ఈ-మేనేజర్‌, యాదాద్రి భువనగిరి

మీ సేవ కేంద్రంలో ఛార్జీల పట్టిక, ఫిర్యాదు నెంబర్ల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. నిర్ణీత రుసుం కన్న అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటాం. ఎవరైన అధిక రుసుం వసూలు చేసినా.. గడువులోగా సేవలందించకున్నా రాష్ట్ర స్థాయి కాల్‌సెంటర్‌ నెంబర్‌ 1100 లేదా మా చరవాణి సంఖ్య 93984 24331కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు