logo

పర్యవేక్షణ కొరవడి.. గట్టు దెబ్బతిని

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కట్ట నాణ్యతపై రోజురోజుకూ భయాందోళన పెరుగుతోంది. గత నెల 7న నిడమనూరు మండలం ముప్పారం వద్ద గండి పడి 13 రోజులు సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు.

Published : 05 Oct 2022 05:59 IST

రైతులను కలవరపరుస్తున్న సాగర్‌ ఎడమ కాల్వ స్థితి  


హాలియా వద్ద కుంగిన సాగర్‌ ఎడమ కాల్వ లైనింగ్‌

హాలియా, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కట్ట నాణ్యతపై రోజురోజుకూ భయాందోళన పెరుగుతోంది. గత నెల 7న నిడమనూరు మండలం ముప్పారం వద్ద గండి పడి 13 రోజులు సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా హాలియా వద్ద 16.800 కి.మీ.వద్ద కాల్వ లైనింగ్‌ రోజు రోజుకూ కుంగిపోతుండడానికి తోడు చాలా చోట్ల ఇదే తీరుగా కాల్వ దెబ్బతిని కనిపిస్తుండడం రైతాంగాన్ని కలవరపరస్తోంది.  

వేధిస్తున్న సిబ్బంది కొరత  

ఎడమ కాల్వ 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగువుతోంది. ఎంతో ప్రాముఖ్యం గల ఈ కాల్వ పర్యవేక్షణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. 15 ఏళ్లుగా సిబ్బంది నియామకం చేపట్టక, ఉన్న సిబ్బందిలో ఒక్కరొక్కరు పదవీ విరమణ పొందగా.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాగర్‌ ఎడమ కాల్వ పొట్టిచెల్మ నుంచి మూసీ వరకు 4 జేఈలు ఉండాల్సి ఉండగా ఒక్కరు.. హాలియా, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, వేములపల్లి, తడకమళ్ల, మూసీ సెక్షన్స్‌లో ఇద్దరు చొప్పున 14 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా పది మంది, ప్రతీ సెక్షన్‌కు నలుగురు చొప్పున 28 మంది లష్కర్లు ఉండాల్సి ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 61 ఏళ్లకు పదివీ కాలం పెంపుదల చేయకుంటే ఇప్పటికే సగంమంది లష్కర్లు ఉద్యోగ విరమణ చేసే వారని ఓ అధికారి ‘న్యూస్‌టుడే’తో అభిప్రాయం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఆశాదీపమైన ఎడమ కాల్వపై నిర్లక్ష్యం చేయకుండా సిబ్బంది నియామకం చేపట్టి, తగిన మరమ్మతులను నాణ్యంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం - సంపత్‌, డీఈ, ఎన్నెస్పీ

ప్రస్తుతం ఎడమ కాల్వకు సంబంధించి వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, లష్కర్ల కొరత లేదు. జేఈ ఒక్కరు మాత్రమే ఉన్నారు. హాలియా, పెద్దదేవులపల్లి ఇన్‌ఫాల్‌ తదితర ప్రాంతాల్లో తలుపుల వద్ద నైట్‌ వాచ్‌మెన్లు, ఎలక్ట్రీషియన్‌ ఫిట్టర్‌, మెకానిక్‌ల కొరత ఉంది. సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని