logo

నేర వార్తలు

గ్యారేజీలో డీసీఎం వాహనానికి మరమ్మతులు చేస్తుండగా.. డ్రైవర్‌ ముందుకు నడపడంతో మెకానిక్‌ మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

Published : 24 Mar 2023 04:44 IST

మరమ్మతులు చేస్తుండగా.. వాహనం ముందుకెళ్లడంతో మెకానిక్‌ మృతి

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: గ్యారేజీలో డీసీఎం వాహనానికి మరమ్మతులు చేస్తుండగా.. డ్రైవర్‌ ముందుకు నడపడంతో మెకానిక్‌ మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ వి.అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గ్యార చంద్రయ్య(53) ఘట్‌కేసర్‌లోని తవక్కల్‌ ఆటో గ్యారేజ్‌లో పని చేస్తున్నాడు. బుధవారం మరమ్మతుల కోసం డీసీఎం గ్యారేజ్‌కు వచ్చింది. చంద్రయ్య వాహనం కిందకు వెళ్లి పని చేస్తుండగా... గమనించని డ్రైవర్‌ వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. తీవ్రగాయాలు కావడంతో తోటి కార్మికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. గురువారం మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


హత్యానేరం కేసులో జీవిత ఖైదు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: హత్యానేరం కేసులో భువనగిరి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన నిందితుడు నైని యాదగిరి(40)కు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యాదగిరి అదే కాలనీలోనే ఆయన పాలివాళ్లైన నైని పర్వతాలుతో కలిసి కూలీ పనిచేస్తుండేవాడు. యాదగిరి మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా పర్వతాలును డబ్బులు అడిగేవాడు. డబ్బులు ఇచ్చేందుకు పర్వతాలు నిరాకరించడంతో యాదగిరి ఆయనపై కక్ష పెంచుకున్నాడు. 2017 జనవరి 17న పర్వతాలు ఆయన ఇంట్లో ఉండగా యాదగిరి వెళ్లి కర్రలతో దాడి చేసి త్రీవంగా గాయపర్చి కిరోసిన్‌ పోసి నిప్పటించి హత్య చేశాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు యాదగిరిపై  భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో హత్యానేరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణాధికారిగా అప్పటి సీఐ ఎమ్‌.శంకర్‌ ఆధ్వర్యంలో కేసుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను పోలీసులు సేకరించి అభియోగపత్రాలను న్యాయస్థానానికి అందజేశారు. న్యాయస్థానంలో వాదోపవాదాలతోపాటు విచారణ అనంతరం నిందితుడే హత్య చేసినట్లు రుజువుకావడంతో జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి వి.బాలభాస్కరరావు తీర్పును వెల్లడించారు. దోషి యాదగిరికి జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని