logo

వార్డు సభ్యుడు..ఆపై ఏకంగా ఎమ్మెల్యే పదవి

వార్డు సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఏకంగా ఎమ్మెల్యే పదవి వరించిన సంఘటన ఇది. రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన చల్లూరు పోచయ్య 1978 ప్రాంతంలో స్థానికంగా వార్డు సభ్యుడు

Updated : 07 Nov 2023 05:12 IST

చల్లూరు పోచయ్య

వార్డు సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఏకంగా ఎమ్మెల్యే పదవి వరించిన సంఘటన ఇది. రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన చల్లూరు పోచయ్య 1978 ప్రాంతంలో స్థానికంగా వార్డు సభ్యుడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయన చదివింది కూడా పెద్దగా ఏమీలేదు. స్థానికంగా ఓ గురువువద్ద పెద్ద బాలశిక్షను పూర్తిచేసినట్లుగా అప్పట్లో తెలిపేవారు. అయితే బొందుగుల గ్రామానికి చెందిన ముక్క రాజమల్లయ్యకు ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆలేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే సంకల్పంతో కొందరు నాయకులతో కలిసి పోచయ్య హైదరాబాద్‌ వెళ్లారు. అధిష్ఠానం అప్పట్లో రాజమల్లయ్యకు పార్టీ టికెట్‌ ఇవ్వడానికి సుముఖంగా ఉండటంతో రాత్రి కావడంతో వారంతా అక్కడే ఓ హోటల్‌లో బసచేశారు. తెల్లారి లేచి చూసేసరికి రాజమల్లయ్య హోటల్‌నుంచి వీరికి చెప్పకుండా వెళ్లి రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీచేయడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. ఇందిరా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు. ఈ తరుణంలో పార్టీ నాయకత్వం చల్లూరు పోచయ్యకు ఇందిరా కాంగ్రెస్‌ తరఫున అభ్యర్థిగా ఖరారు చేసింది. అదృష్టవశాత్తు లభించిన అవకాశం వల్ల 1978లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచి 35 వేల మెజార్టీతో గెలుపొందాడు పోచయ్య. అతి సాధారణ జీవితానికి అలవాటు పడిన చల్లూరు పోచయ్య తన పదవీ కాలం ముగిసినా రెండు దశాబ్దాలకు పైగా సైకిల్‌పైనే తిరిగేవారు. తదనంతరం 1982, 1987లో, 2002 సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అనంతరం స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ సామాన్య జీవనం సాగించే క్రమంలో మూడేళ్ల క్రితం మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు