logo

భువనగిరి బరిలో చామల

ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్‌ పార్టీ తమ భువనగిరి లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.

Published : 28 Mar 2024 05:02 IST

ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ : ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్‌ పార్టీ తమ భువనగిరి లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మితో పాటూ పలువురు ఇక్కడి నుంచి టిక్కెట్‌ ఆశించారు. కానీ అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ రాజకీయాలతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్‌గాంధీ కోటరిలో కీలకంగా వ్యవహరించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌, అండమాన్‌, నికోబార్‌ దీవులకు ఇన్‌ఛార్జిగా  వ్యవహరించారు. 2021 నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, మీడియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

తొలిసారి కోమటిరెడ్డి కుటుంబం కాకుండా..

2008లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడగా..2009లో తొలిసారిగా అప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేసి అప్పటి మహాకూటమి నుంచి పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి దివంగత నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2014లో అప్పటి తెరాస (భారాస) అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై స్పల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2019లో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి అప్పటి సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యపై గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి నాలుగోసారి ఎన్నికలు జరుగుతుండగా.. కోమటిరెడ్డి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీ చేస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని