logo

టెట్‌పై యువత గురి

ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్‌’ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated : 29 Mar 2024 06:17 IST

ఓ శిక్షణ కేంద్రంలో ఆసక్తిగా వింటున్న విద్యార్థులు  (పాతచిత్రం)

రాజపేట, మహాత్మాగాంధీ రోడ్డు (సూర్యాపేట) న్యూస్‌టుడే : ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్‌’ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని డీఎడ్‌, బీఎడ్‌ అభ్యసించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించేందుకు వేలాది మంది నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారు. కాగా గత సెప్టెంబరులో నిర్వహించిన టెట్‌ పరీక్షకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 43,681 మంది దరఖాస్తు చేసుకోగా 36,919 మంది హాజరయ్యారు. అందులో పేపర్‌-1కు 18,174 మంది, పేపర్‌-2కు 18,745 మంది టెట్‌ పరీక్షను రాశారు.

ఉత్తీర్ణత తప్పనిసరి..

జీహెచ్‌ఎంలకు స్కూల్‌ అసిస్టెంట్‌, బదిలీ, ఉద్యోగోన్నతులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ఫిమేల్‌ లిటరసీ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) 2023 సెప్టెంబర్‌లో స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇటీవల టెట్‌ ప్రకటన వెలువరించిన నేపథ్యంలో ఈ బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో టెట్‌ ఆఫ్‌లైన్‌లో జరిగేది. ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో నాలుగు పర్యాయాలు..

రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2016 మే 22న తొలిసారి, 2017 జులై 13న రెండోసారి, గతేడాది జూన్‌ 12న మూడోసారి నిర్వహించగా, నాలుగోసారి సెప్టెంబర్‌ నెలలో నిర్వహించారు. తాజాగా మెగా డీఎస్సీకి ముందు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడంతో ఈసారి టెట్‌లో అత్యధికంగా మార్కులు పొందాలనే తపనతో యువత ఉన్నారు. టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 2017లో టీఆర్టీని నిర్వహించి దశలవారీగా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టారు. అనంతరం ఇప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడంతో ఈ వృత్తిపై ఆసక్తిగల జిల్లాలోని అభ్యర్థులు నియామకాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజా ప్రకటనతో ఆశలు చిగురించాయి.


ఉపాధ్యాయిని కావాలనే తపనతో

సకినాల స్వాతి, రాజపేట

2020లో డిగ్రీ పూర్తి చేసి 2022లో బీఈడీ కూడా పాసయ్యాను. ఉపాధ్యాయ వృత్తిపట్ల అమితమైన గౌరవం కారణంగా ఎలాగైనా టీచర్‌ జాబ్‌ కోట్టాలనే తపనతో ఉన్నాను. 2022లో వేసిన టెట్‌లో క్వాలిఫై అయినప్పటికీ ఈసారి వేయనున్న టెట్‌లో మరిన్ని ఎక్కువ మార్కులు సాధించాలని కృషి చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతిభ చూపి ఈ డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని