logo

దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ

నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్‌ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి

Published : 19 Apr 2024 06:25 IST

అత్యవసర మోటార్ల నుంచి అప్రోచ్‌ కెనాల్‌లోకి విడుదలవుతున్న నీరు

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్‌ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. రూ.4 కోట్లతో నాగార్జునసాగర్‌ జలాశయంలో అత్యవసర మోటార్ల ఏర్పాటు పనులు చివరిదశకు చేరుకున్నాయి. వారం క్రితం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిన జలమండలి అధికారులు బుధవారం రాత్రి నిర్ణీత పది మోటార్లలో నాలుగు మోటార్ల నుంచి ప్రయోగాత్మకంగా నీటిని అప్రోచ్‌కెనాల్‌కు సరఫరా చేశారు. గురువారం మరో రెండు 120 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన మోటార్ల ఏర్పాటు పూర్తిచేసి 240 క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొత్తం 10 మోటార్లతో 900 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. మరోవైపు అప్రోచ్‌ కెనాల్‌లో నీటిమట్టం పెంచేందుకు సాగర్‌ జలాశయంలో అడ్డంగా కట్ట నిర్మాణానికి గ్యాబియన్స్‌, ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. ఈ కట్టతో కాల్వలో 512 అడుగుల నీటిమట్టం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి విడుదలయ్యే కృష్ణాజలాలు 525 క్యూసెక్కులు ఏఎమ్మార్పీ ద్వారా కోదండాపురం మెట్రోవాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటులో శుద్ధి చేసి 270 ఎంజీడీల రూపంలో జంటనగరాలలో 70 శాతం జనాభా దాహార్తి తీర్చుతాయి. నల్గొండ జిల్లాలోని ఉదయసముద్రం, ఆయిటిపాముల, యెడవల్లి, పెండ్లిపాకలలతో పాటు కోదండాపురం, స్వాములవారిలింగోటం మిషన్‌ భగీరథ ప్లాంటుల ద్వారా నిత్యం వేల సంఖ్యలోని గ్రామాల దాహం కేకలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లా, జంటనగరాల తాగునీటి సమస్య తీర్చడంలో కీలకమైన అత్యవసర మోటార్లను దశాబ్దకాలం క్రితం జలమండలి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ జలాశయంలో రూ.10 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా, జంటనగరాల్లో తాగునీటికి క్లిష్ట పరిస్థితుల్లో వీటిని తిరిగి అమర్చి, జలాశయానికి ఎగువ నుంచి వరదల సమయంలో తొలగించి ప్రత్యేకంగా భద్రపరిచి వినియోగిస్తుంటారు. 2019లో చివరి సారిగా వీటిని వినియోగించారు. వీటి ద్వారా 2017 సాగర్‌ జలాశయంలో అత్యంత దిగువకు డ్రెడ్జింగ్‌ చేపట్టి 500 అడుగుల లోతు నుంచి నీటిని సరఫరా చేసారు. ఈ పర్యాయం సైతం కృష్ణానదిలో వరదల పరిస్థితిని బట్టి వీటిని నడపనున్నామని జలమండలి అధికారులు తెలియజేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు