logo

భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.  

Published : 20 Apr 2024 04:32 IST

సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు 

భువనగిరిలో నిర్వహించిన ర్యాలీ

భువనగిరి గంజ్‌, భువనగిరి, న్యూస్‌టుడే: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.  భువనగిరి లోక్‌సభ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమం శుక్రవారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగేకు ఎంపీ అభ్యర్థి జహంగీర్‌తో కలిసి నామపత్రాలను అందజేశారు. అనంతరం భువనగిరి పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్‌ నుంచి వేదిక వరకు ఎర్రదండు కదలింది. అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. ఏఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాఘవులు ప్రసంగిస్తూ.. భాజపా విజయాన్ని నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ విస్తృతంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించి భువనగిరి బరిలో దిగామన్నారు. దురదృష్టవశాత్తు అధికార కాంగ్రెస్‌, భారాసలు పరస్పర దూషణలో కొట్లాడుకుంటున్నాయే తప్ప భాజపా మతతత్వ ధోరణిని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్ట లేకపోతున్నాయని విమర్శించారు. ఆ లోటును పూడ్చేందుకు తాము పెద్ద ఎత్తున్న పోరుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు ఒక్క సీటు  దక్కకుండా ప్రధాన పక్షాలైన కాంగ్రెస్‌, భారాసలు కృషి చేయాలన్నారు. భారాస ఓడిపోయినందుకు కేసీఆర్‌ ప్రజలను నిందిస్తున్నారని ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును అగౌరవపర్చడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ సభలో ప్రధాని మోదీని బడేభాయ్‌ అని ఒకవైపు పొగుడుతూ భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెబుతుంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. భారాసపై ప్రజలకు నమ్మకం లేక కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలతో ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. పార్టీలు మారుతున్న ఇతర పార్టీల అభ్యర్థులకంటే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన జహంగీర్‌ను గెలిపించాలన్నారు. సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు జహంగీర్‌ పోరాటం చేసినా భాజపా నిధులు ఇవ్వలేదన్నారు.  

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

ఎండీ జహంగీర్‌ మాట్లాడుతూ.. మతోన్మాద, అవకాశవాద పార్టీలను ఓడించి విప్లవ పార్టీని ఆదరించాలన్నారు. పార్టీకి చెందిన నాయకులు పలువురు సభలో విరాళాలు అందజేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన నిర్వహించిన సభలో నాయకులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు, జి.జ్యోతి, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్‌, డీజీ నర్సింగ్‌రావు, మల్లు లక్ష్మి, పోతినేని సుదర్శన్‌, ఎండీ అబ్బాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని