logo

చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది

మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను.

Updated : 20 Apr 2024 06:48 IST

జక్క వెంకట్‌రెడ్డి (ఫిర్జాదీగూడ మేయర్‌), పాలడుగు

మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. ఆ రోజుల్లో మా తాతయ్య కొణతం నర్సిరెడ్డి, అమ్మమ్మ పార్వతమ్మ ఊరు ముశిపట్లకు వెళ్లేవాడిని. రాత్రి పూట మా అమ్మమ్మ, తాతయ్య చిన్న, చిన్న కథలు బాగా చెప్పేవారు. వారు కథలు చెబితేనే నేను పడుకునే వాడిని. మా తాతయ్య బావి వద్దకు తీసుకెళ్లి ముంజలు కొట్టించి తినిపించే వారు. తాటిపండ్లు కాల్చి ఇచ్చేవారు. అవి ఎంతో రుచికరంగా ఉండేవి. అప్పటి నా స్నేహితులు రఫీ, శ్రీకాంత్‌, భగవంత్‌ తదితరులతో కలిసి పాతకొట్లబావి వద్దకు ఈతకు వెళ్లేవాడిని. చెరువులోకి వెళ్లి గాలంతో చేపలు పట్టేవాళ్లం. బావి వద్దకు వెళ్లి సైకిల్‌ నేర్చుకునే వాడిని. కాడెడ్లకు దాణా పెట్టి.. నీరు తాగించే వాడిని. అప్పుడు ఆముదం చేను, కందిచేనులోకి వెళ్లి ఎర్రటి దోసకాయలు తినేవాళ్లం. మా ఉపాధ్యాయుడు ముక్క రాములు నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు. నాకు బాగా చదువు చెప్పేవారు. బాలనర్సయ్య సార్‌ కూడా నన్ను బాగా చూసుకునేవారు. చలకుర్తి జవహర్‌ నవోదయ పాఠశాలలో చదివాను. అక్కడ చదువు కష్టంగా ఉండటంతో చెప్పకుండా ఇంటికి వచ్చేశా. అప్పుడు మా నాన్న యాదిరెడ్డి సర్దిచెప్పి నన్ను మళ్లీ ఆ పాఠశాలలో తోలివచ్చారు. నా స్నేహితులు సతీష్‌, రమేష్‌, రమాకాంత్‌తో కలివిడిగా ఉండేవాడిని. చదువులో పోటీపడేవాళ్లం. అప్పుడు భూరెడ్డి పెద్దనాగిరెడ్డి సాంఘికశాస్త్రం చెప్పేవారు. ఆయన నన్ను ఎంతో ప్రభావితం చేశారు. ఇప్పటికీ ఆయన నాకు దిక్సూచిలా సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

అమ్మమ్మ ఇంటికి వెళ్లాలి..

నేటి తరం విద్యార్థులు, యువకులు ఈ వేసవి సెలవుల్లోనైనా ఊర్లోని అమ్మమ్మ, నాన్నమ్మ ఇళ్లకు వెళ్లి వారితో గడపాలి. అప్పుడే వారితో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అనురాగం, ఆత్మీయతలు పెంపొందుతాయి. ఎంతసేపు సెల్‌ఫోన్‌, సామాజిక మాధ్యమాల్లో గడపొద్దు. కుటుంబ సభ్యులు, బంధువులతో వేసవి సెలవులు గడిపితే ఆ అనుభూతులు జీవితకాలం గుర్తుంటాయి.

- న్యూస్‌టుడే, మోత్కూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని