logo

నల్గొండలో 4... భువనగిరిలో 5

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్‌సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 05:02 IST

 

నల్గొండ లోక్‌సభ స్థానానికి ధర్మ సమాజ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన తలారి రాంబాబు.

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్‌సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దాసరి హరిచందనకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ధర్మసమాజ్‌ పార్టీ తరఫున తలారి రాంబాబు, మార్స్కిస్ట్‌ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యునైటెడ్‌) తరఫున వసుకుల మట్టయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య నామపత్రాలు దాఖలు చేశారు. తొలి రోజు గురువారం నలుగురు అభ్యర్థులు దాఖలు చేయగా..రెండో రోజు శుక్రవారం సైతం నలుగురు దాఖలు చేయడంతో రెండు రోజుల్లో నామినేషన్లు వేసిన వారి సంఖ్య మొత్తం ఎనిమిదికి చేరింది.

 మార్క్సిస్ట్‌ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యునైటెడ్‌) పార్టీ అభ్యర్థి వసుకుల మట్టయ్య
 స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కిన్నెర యాదయ్య. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన బండారు నాగరాజు

భువనగిరి లోక్‌సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి హనుమంతు కె.జెండగేకు సమర్పించారు. ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటూ మరో ముగ్గురు స్వతంత్రులు నామపత్రాలు సమర్పించారు. తొలిరోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ వేయగా..రెండోరోజు శుక్రవారం ఐదుగురు వేశారు. దీంతో రెండు రోజుల్లో లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య ఎనిమిదికి  చేరింది.  భువనగిరిలో శుక్రవారం భాజపా అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ పార్టీ నాయకులు పాశం భాస్కర్‌, పడమటి జగన్మోహన్‌రెడ్డి, కోళ్ల భిక్షపతి, రత్నపురం బలరాంతో కలిసి నామినేషన్‌ వేశారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌, ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, కొండమడుగు నర్సింహలతో కలిసి తన నామపత్రం అందజేశారు. సోషలిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజలాపురానికి చెందిన మెగావత్‌ చందు, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరిమదేవిగూడెం గ్రామనికి చెందిన రేఖల సైదులు నామినేషన్‌ వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని