logo

ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు

ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

Published : 05 May 2024 04:35 IST

అడుగంటుతున్న భూగర్భ జలాలు

సూర్యాపేటలోని ఎన్టీఆర్‌ నగర్‌లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ నుంచి లీకవుతున్న నీరు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. సిలికాన్‌ సిటీ నీటి సమస్యతో కేప్‌టౌన్‌ నగరం పేరు తెరమీదకు తీసుకొస్తున్నారు. అక్కడ ఆరేళ్ల కింద తలెత్తిన నీటి సంక్షోభం ప్రపంచంలోనే తీవ్రమైనదిగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరు నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరముంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలోని గ్రామాలు, అయిదు పురపాలికల్లో జల వనరులు అడుగంటుతున్నాయి. దీనికి తోడు నీటి వృథా అవుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ నీటి వనరుల్లో కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగర్భ జలమట్టం పడిపోవడం, అడుగుంటుతున్న జలాశయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయాలపై అధికారగణం అప్రమత్తం.. ప్రజలు చైతన్యమై నీటి వృథాని అరికట్టడానికి సిద్ధం కావాల్సిన తరుణమిది. జిల్లాలో నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతానికి తీవ్ర కరవు పరిస్థితులు లేవనే ధీమాలో ఉన్నా.. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలను దరిదాపుల్లోకి రానీయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని గ్రామాలతో పాటు పురపాలికల్లో ప్రతి పౌరుడు రోజుకు ఒక లీటరు నీటిని పొదుపు చేసినా.. అది నీటి బ్యాంకులో రోజుకు 54,08,800 లీటర్లు ఆదా అవుతుంది.

కారణాలేంటి..

నీటి సంక్షోభం తలెత్తినా దానికి మానవ తప్పిదాలే కారణమన్నది సుస్పష్టం. వాతావరణం మార్పులకు గురి కావడానికి మనిషి కొనసాగిస్తున్న కార్యకలాపాలే కారణం. ముఖ్యంగా జిల్లాలోని అయిదు పురపాలికల్లో చెరువులను ఆక్రమించి ప్లాట్లుగా మార్చటం.. నీటి వనరుల సంరక్షణ చేపట్టకపోవడంతో వేసవిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలకు చర్యలు తీసుకోకపోవటంతో వాన నీరింకే పరిస్థితి లేకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని