logo

గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన

ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్‌ అన్నారు.

Published : 05 May 2024 04:37 IST

క్యామ మల్లేష్‌

ఈనాడు, నల్గొండ- న్యూస్‌టుడే, భువనగిరి : ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్‌ అన్నారు. లోక్‌సభ పరిధిలోని చాలా సమస్యలకు గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి సోదరులు, ప్రస్తుత భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ కారణమని ఆరోపించారు. తనని ఎంపీగా గెలిపిస్తే ఆరు నెలల్లోగా రైల్వే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

నాది ప్రజల ఎజెండా

నేను ప్రజల ఎజెండాతో ముందుకెళ్తున్నాను. లోక్‌సభ పరిధిలో ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటే దానికి కోమటిరెడ్డి సోదరులు, బూర నర్సయ్యలే కారణం. మూసీ కాలుష్యాన్ని ఎన్నికల నినాదంగా మార్చారు తప్పితే పరిష్కరించలేదు. నన్ను ఎంపీగా గెలిపించిన వెంటనే నా మొదటి ప్రాధాన్య అంశంగా మూసీ ప్రక్షాళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధిస్తాను. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలున్నా గత ఎంపీలు పట్టించుకోలేదు. పరిశ్రమల స్థాపనతో స్థానికులకు ఉపాధి కల్పిస్తాను.

డ్రైపోర్టు ఏర్పాటుతో ఉపాధి కల్పన

గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. డ్రైపోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మా ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నన్ను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిర్మించే విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాను.

ఆధ్యాతిక, పర్యాటక వలయంపై

నియోజకవర్గ పరిధిలో అనేక చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కట్టడాలున్నాయి. వీటిని పరిరక్షించాల్సి ఉంది. భువనగిరి కోట, యాదాద్రి, కొలనుపాక, రాచకొండ గుట్టలను కలిపి ఆధ్యాత్మిక, పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాను. కేంద్రం మంజూరు చేసిన రూ.100 కోట్ల స్వదేశీ దర్శన్‌ నిధులు త్వరితగతిన విడుదలయ్యేందుకు చర్యలు తీసుకుంటాను.

కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే ఎంఎంటీఎస్‌లో జాప్యం..

ఎంఎంటీఎస్‌ మూడో దశకు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు రాయగిరి వరకు రైలు ప్రయాణం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేది. ఎంపీగా ఎన్నికయిన వెంటనే రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మూడో దశను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాను. యాదాద్రి పుణ్యక్షేత్రానికి రద్దీ పెరుగుతున్నందున ఇక్కడి వరకు మెట్రో ప్రాజెక్టు ఆవశ్యకతను సైతం కేంద్రానికి వివరిస్తాను. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటూ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను భువనగిరి, ఆలేరు, జనగామల్లో ఆపేందుకు అధికారులతో మాట్లాడుతాను. నకిరేకల్‌, తుంగతుర్తి లాంటి సెగ్మెంట్లలో ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తాను.

జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణపై...

ఎన్‌హెచ్‌ఏఐ, రవాణా, పోలీసులు, జాతీయ రహదారుల సంస్థ నిపుణులతో సంయుక్తంగా సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాను. ప్రమాదాల శాశ్వత నివారణకు బ్లాక్‌స్పాట్‌ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్యలు తీసుకుంటాం. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్నందు వల్లా ఇప్పుడున్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతాను.

ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి సేవలకు చర్యలు

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేంద్రం ఎయిమ్స్‌ను మంజూరు చేస్తే మాజీ సీఎం కేసీఆర్‌ దానిని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలని బీబీనగర్‌లో ఏర్పాటు చేయించారు. గెలిచిన వెంటనే ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో సేవలు అందేలా కేంద్ర వైద్యశాఖ మంత్రిని కలుస్తాను. నా తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యంపైనే. వీటితో పాటూ ఇబ్రహీంపట్నంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, తుంగతుర్తి లాంటి వెనకబడిన ప్రాంతాల్లో ఐటీ కారిడార్‌ నెలకొల్పడానికి కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని