logo

గాలి, వాన బీభత్సం

జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. మోత్కూరు, కొండగడప, జామచెట్లబావి వద్ద పలువురి రేకుల ఇళ్ల పైకప్పులు లేచి పోయాయి.

Published : 06 May 2024 02:35 IST

సంస్థాన్‌ నారాయణపురంలో ఈదురు గాలులకు ధ్వంసమైన ఉప్పల కృష్ణ కోళ్ల ఫారం

మోత్కూరు, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. మోత్కూరు, కొండగడప, జామచెట్లబావి వద్ద పలువురి రేకుల ఇళ్ల పైకప్పులు లేచి పోయాయి. పాత బస్టాండ్‌లో విద్యుత్తు స్తంభం విరిగిపోయి కరెంటు సరఫరా నిలిచిపోయింది. మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయని రైతులు తెలిపారు. కేంద్రాల్లో వర్షానికి ధాన్యం నానిపోయింది.

గుండాల: గుండాల మండలంలో మామిడి తోటలు దెబ్బతినగా.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. తూకం వేసిన 4800 ధాన్యం బస్తాలు, రాశులు పూర్తిగా తడిసిపోయాయి. పిగుడుపాటుతో మండలంలోని తురకలశాపురం గ్రామంలో జక్కుల యాదయ్యకు చెందిన పాడి గేదె మృతిచెందింది.

సంస్థాన్‌ నారాయణపురం: నారాయణపురం, వెంకంబావితండ, అల్లందేవిచెర్వు వంటి తదితర గ్రామాల్లో స్తంభాలు విరగడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నారాయణపురంలో ఉప్పల కృష్ణ కోళ్ల ఫారాలు ధ్వంసం అయింది. గుజ్జ గ్రామంలో పిడుగు పాటుకు చాపల వెంకటేశానికి చెందిన రెండు ఎడ్లు మృత్యువాత పడ్డాయి.

వలిగొండ: వెంకటాపురంలో జక్కుల కృష్ణ వ్యవసాయ క్షేత్రంలో పిడుగు పడి పాడిఆవు మృతి చెందింది. దుప్పల్లిలో కన్నెబోయిన లింగస్వామి కోళ్లఫారం పాక్షికంగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని