logo

గతమంతా ఘనం.. ఇప్పుడంతా ధనం

ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఇదే.

Updated : 06 May 2024 05:54 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఇదే. జనం తరలింపు బాధ్యత స్థానిక నేతలదే. వాహనాలు పెట్టి జనాన్ని తరలించడమే కాకుండా.. తమ పనులు మానుకొని వస్తున్నందుకు సాయంకాలానికి వారికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేదంటే మరోసారి సమావేశానికి పిలిచినా ముఖం చాటేస్తున్నారు. ఎప్పుడూ ఇచ్చే డబ్బులు కాకుండా అదనంగా ఇవ్వాలని పలువురు చోటామోటా నేతల వద్ద డిమాండ్‌ చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఆరేడు గంటలు అక్కడ నిరీక్షించాలంటే ఆ మాత్రం ఇచ్చుకోవాల్సిందేనని చెబుతున్నారు.

కాలు బయట పెట్టాలంటే..

గతంలో పార్టీలకు అంకితభావంతో పనిచేసే నాయకులు ఉండేవారు. పార్టీలను అంటిపెట్టుకొని అవసరమైతే తమ జేబుల నుంచి ఖర్చు పెట్టి నాయకులను గెలిపించుకునేవారు. రాను రానూ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. ప్రజలు, కార్యకర్తల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు చాలా తక్కువ. నీ పార్టీ ప్రచారానికి వస్తే నాకేంటి.. అనే ధోరణి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. అభ్యర్థుల నామినేషన్‌ నాటి నుంచి ఎన్నికల సభలు, రోడ్‌ షోలు, ఇతర అన్ని ప్రచార కార్యక్రమాలకు జనసమీకరణ అభ్యర్థులకు కత్తిమీదసామే అవుతోంది. భువనగిరి, నల్గొండ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్‌షోలు, సభలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో లోక్‌సభ స్థానంలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లు, మున్సిపాలిటీలు, మండలాలు, ఇలా అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారానికే 100 నుంచి 200 మంది వరకు అవసరం. రోజంతా ప్రచారం నడవాలంటే చేతిలో డబ్బులు పడాల్సిందే. లేదంటే కాలు కదిపేది లేదంటున్నారు.  

కింది స్థాయి నేతలే నుంచే..

జన సమీకరణలో చోటామోటా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలను అభ్యర్థులు తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇందుకు నేత స్థాయిని బట్టి ముడుపులు ముడుతున్నాయి. ర్యాలీలు, ప్రచారానికి కూలీలు, గ్రామాల్లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువతను తరలించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఠారెత్తిస్తున్న ఎండలకు యువకులు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. బైకు ర్యాలీలకు పెట్రోల్‌, భోజనాలు, సాయంత్రం పార్టీలకు ఖర్చు రాజకీయ నేతలే భరించాలి. ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొనాలంటే భోజనం ఇతర ఖర్చులతో పాటు రూ.500-1000 వరకు ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. ఈ మాత్రం ఇవ్వకుండా ఎండలో ఎలాతిరుగుతారని కింది స్థాయి నేతలూ అభ్యర్థులను ఖర్చుకు మెప్పించక తప్పని స్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని