logo

నాన్నకు భారమై.. అమ్మకు దూరమై..!

పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు

Updated : 07 May 2024 07:05 IST

బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత

అనాథలైన అభంశుభం తెలియని చిన్నారులు

 

 రోదిస్తున్న చిన్నారులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. తల్లిపాలు తాగాలని చిన్నారి, అమ్మ చేతితో గోరుముద్దలు తినాలని బాలుడు మారాం చేస్తుంటే.. అమ్మ అచేతన స్థితిలో.. నాన్న రాలేని స్థితిలో ఉన్నాడని.. అర్థంకాని స్థితిలో ఉన్న ఆ పిల్లలకు ఎలా చెప్పి నచ్చజెప్పాలో తెలియక కుటుంబసభ్యులు, స్థానికులు  కంటతడి పెట్టారు. ఈ హృదయ విదారక ఘటన యాదగిరిగుట్టలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రమేశ్‌, స్థానికుల కథనం ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూడిద యాదయ్య, దేవమ్మ దంపతుల చిన్న కూతురు గడిపె నాగమణి(25)ని జనగామ జిల్లా నాగారం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ ప్రవీణ్‌కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. వీరికి వర్ధన్‌(3), లక్ష్మీ ప్రసన్న(9 నెలల) పిల్లలు కలిగారు. ఆ తర్వాత భర్త వరకట్న వేధింపులు, గృహ హింసకు గురిచేయడం, మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడంతో గొడవలు జరిగాయి. పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఈ నెల 3న పిల్లలతో కలిసి తల్లిగారి ఇంటికి చేరింది. సోమవారం మధ్యాహ్నం ఆవేశంతో ఆ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయడం, అక్కడే పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు శ్రీనివాస్‌, ప్రభాకర్‌, డ్రైవర్‌ శంకర్‌ గమనించి హుటాహుటిన బావిలో దూకి, ఆమెను రక్షించారు. సీపీఆర్‌ చేసి భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వృద్ధులైన యాదయ్య, దేవమ్మలకు ఇద్దరు సంతానం కాగా, పెద్ద కూతురు రేణుక పాముకాటుతో మృతి చెందగా, చిన్నకూతురు ఆత్మహత్య చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని