logo

సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు.

Published : 07 May 2024 06:45 IST

రాజపేట, ఆలేరు, న్యూస్‌టుడే: ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. ప్రస్తుతం కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో చరవాణి ఉన్న ప్రతి ఒక్కరూ క్షణాల్లో అన్నీ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోని  ప్రధాన పార్టీల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు.

 సామాజిక మాధ్యమాలే కీలకం..

 ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక మాధ్యమాలు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాయకులు, వారి అనుచరులు ఎక్స్‌ ఖాతాను తెరవడంతో పాటు అభిమాన నేతలను అనుసరిస్తుంటారు. చాలా మంది నాయకులు, ప్రజా ప్రతినిధులకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి ఉండటం గమనార్హం. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుని సాయంత్రం నుంచి మళ్లీ ప్రచారం చేస్తున్నారు. రహదారులు, గల్లీల్లో మైకుల మోత ఒక పక్క మోగుతుంటే, మరో వైపు సామాజిక మాధ్యమాలైన వాట్సప్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర వాటిలో ప్రచారం గుప్పిస్తున్నారు. పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టో వివరించడం, ప్రత్యర్థులకు దీటుగా సమాధానం చెప్పడానికి సామాజిక వేదికలను వినియోగించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు రూపొందించిన యూట్యూబ్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వివాదాస్పద వీడియోలు, చిత్రాలు వేరేవారికి పంపితే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. గ్రూప్‌ అడ్మిన్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

పల్లెల్లో వాట్సప్‌ గ్రూపుల గోల..

ప్రతి గ్రామంలో వాట్సప్‌ గ్రూపులు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో సమాచారం చేరవేయడానికి లెక్కలేనన్ని కొత్త గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. సమావేశం, ప్రచారం ఉందంటే గ్రూపులో పోస్టు చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో అందరూ ఒకే దగ్గరకు చేరుకుంటున్నారు. ప్రధాన పార్టీలన్నింటికీ గ్రూపులతోపాటు గ్రామం, మండలం, పట్టణం, జిల్లాల గ్రూపులు ఏర్పాటయ్యాయి. జన సమీకరణతో పాటు అదే సమయానికి కార్నర్‌ మీటింగ్‌, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం, క్లస్టర్‌ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి ఈ గ్రూపులు దోహదపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని