logo

ఆమె ఇంటికే పరిమితమైతే..అంతే..!

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది.

Updated : 07 May 2024 07:00 IST

మహిళల పోలింగ్‌ శాతం తగ్గితే ఫలితాలపై ప్రభావం

ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తగ్గిన అతివల ఓటింగ్

 

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది. ముఖ్యంగా భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉండటం గమనార్హం. అంతా బాగానే ఉన్నా దేశంలో గడిచిన రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే మహిళా పోలింగ్‌ తక్కువేనని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ తలెత్తితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలో మొత్తం 35,17,658 ఓట్లుండగా.. ఇందులో మహిళా ఓటర్లు 17,80,788 మంది ఉన్నారు. నల్గొండ లోక్‌సభ పరిధిలో 17,18,954 ఓట్లకుగానూ 8,76,538 మహిళా ఓటర్లున్నారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో 17,98,704 ఓట్లకుగానూ 9,04,250 మంది మహిళా ఓటర్లు ఉండటం గమనార్హం.

 ఇటీవల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే..

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన మొదటి, రెండు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే ఓటు హక్కు వినియోగంపై మహిళలు అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఈ విషయమై కొన్ని రాష్ట్రాల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే అర్ధం అవుతోంది. మిజోరంలో పురుష ఓటర్ల పోలింగ్‌ శాతం 58.1 ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్‌ శాతం 55.7 ఉంది. రాజస్థాన్‌లో పురుషుల పోలింగ్‌ 62.2 ఉంటే మహిళల పోలింగ్‌ 60.5 ఉందని ఎన్నికల సంఘం తెలిపిన గణాంకాలు వివరిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 65.3, 61.3 మహిళల పోలింగ్‌ ఉంది. మహారాష్ట్రలో 65.9 పురుషుల, 60.7 మహిళల పోలింగ్‌ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 75 శాతం పురుషుల పోలింగ్‌ శాతం ఉంటే 73.5 శాతం మహిళా ఓట్ల పోలింగ్‌ శాతం ఉండటం గమనార్హం.

మండే ఎండలూ ఒకింత కారణం..

ముఖ్యంగా అభ్యర్థుల ప్రచారం, సభలు, సమావేశాల్లోనూ మహిళలు అంతగా ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం మండే ఎండలనే తెలుస్తోంది.  ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని, పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పోలింగ్‌ జరిగే సమయాన్ని అదనంగా ఒక గంటపాటు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మండిపోతున్న ఎండల కారణంగా పోలింగ్‌ ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఎక్కువ శాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం వేళల్లో మహిళలు వంట ఇతర ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండనున్నందున సాయంత్రం పోలింగ్‌కే మహిళామణులు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని