logo

సౌర విద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు

విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది.

Published : 07 May 2024 06:59 IST

సౌర పలకలు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఎక్కడికక్కడే  సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సౌర విద్యుత్తు తయారు చేసి వినియోగించుకునేలా ఆ శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందుకోసం ప్రభుత్వ స్థలాల ఎంపిక చేయడానికి సర్వే ప్రక్రియ వేగవంతం అయింది.

కుసుమ పథకం ద్వారా..

 కేంద్ర ప్రభుత్వం కుసుమ పథకం కింద ప్రతి జిల్లాలో నాలుగు ఎకరాల ప్రభుత్వం భూమి సేకరించాలని నిర్ణయించింది. ఇందులో అన్‌ గ్రేడ్‌ సిస్టమ్‌తో రెండు మెగా వాట్ల సౌర యూనిట్లు ఏర్పాటు చేయనుంది. దీంతో ఉత్పత్తి అయ్యే సౌరవిద్యుత్తును విద్యుత్తు సంస్థలకు విక్రయించాలనే ఉద్దేశ్యంతో పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రానున్న రోజుల్లో విద్యుత్తు డిమాండ్‌ను అధిగమించి సౌరవిద్యుత్తు ఉత్పత్తి పెద్ద ఎత్తున చేయనున్నారు. ఇది విజయవంతం అయితే రానున్న రోజుల్లో సౌర విద్యుత్తునే ఎక్కువ తయారీ చేసే అవకాశం ఉంది. భూముల సేకరణ కోసం టీఎస్‌ రెడ్కోకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భూముల సేకరణకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపినట్లు రెడ్కో అధికారులు తెలిపారు. ఇందుకోసం డీఆర్‌డీఏ, పంచాయతీ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలు సంయుక్త సర్వే చేయడానికి నిర్ణయించాయి. ప్రతి జిల్లాలో నాలుగు ఎకరాలు సేకరిస్తే కేంద్ర సంస్థలతో అన్‌గ్రేడ్‌ సిస్టంతో రెండు మెగా వాట్ల సౌర యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.


 భూముల కోసం సర్వే చేస్తున్నాం..
మర్రు పాండురంగారావు, మేనేజర్‌, టీఎస్‌ రెడ్కో ఉమ్మడి నల్గొండ

ప్రతి జిల్లాలో నాలుగు ఎకరాల ప్రభుత్వం స్థలాలు సేకరించి అందులో అన్‌గ్రేడ్‌ సిస్టమ్‌తో మెగా సౌర యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు పంపింది. జిల్లాలో డీఆర్‌డీఏ, దేవాదాయ ధర్మాదాయ, పంచాయతీ శాఖ అధికారులతో చర్చించి భూముల కోసం సర్వే చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని