logo

అభివృద్ధిని వివరించి.. ఆమోదీంచాలని అభ్యర్థించి..!

భువనగిరి పార్టీ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్‌, సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన జనసభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

Published : 07 May 2024 07:04 IST

చౌటుప్పల్‌ జనసభలో అభివాదం చేస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ అభ్యర్థి డా.బూర నర్సయ్యగౌడ్‌, నాయకులు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, చౌటుప్పల్‌, నీలగిరి:నల్గొండ, భువనగిరి పార్టీ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్‌, సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన జనసభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ప్రధానంగా ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారి వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్‌, భారాస పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని విమర్శించిన భాజపా అధినేత మోదీని మరోసారి ప్రధానిగా చేసేందుకు నల్గొండ, భువనగిరిలో భాజపాను గెలిపించాలని కోరారు. చౌటుప్పల్‌లో షెడ్యూల్‌ కంటే రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన నడ్డా భువనగిరి నియోజకవర్గంలో గతంలో బూర ఎంపీగా పనిచేసిన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తాను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేశానని..అందుకు బూర నర్సయ్య కృషి చేశారన్నారు. కాంగ్రెస్‌, భారాస అవినీతిని ఎండగడుతూ తమ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు.

చౌటుప్పల్‌లో భాజపా ఎంపీ నియోజకవర్గ రాజకీయ ఇన్‌ఛార్జి చాడ సురేశ్‌రెడ్డి, ప్రభారి పాపారావు, కన్వీనర్‌ బందారపు లింగస్వామి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి, దాసరి మల్లేశం, జిల్లాల అధ్యక్షులు పాశం భాస్కర్‌, దశరథరెడ్డి, వర్షిత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, దయానంద్‌గౌడ్‌, బాషా, భిక్షం పాల్గొన్నారు.  

 నల్గొండలో  భాజపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ నాయకులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, గోలి మధుసూధన్‌రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, బండారు ప్రసాద్‌, పిల్లిరామరాజు యాదవ్‌, నూకల నర్సింహారెడ్డి, కంకణాల నివేదితరెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 అవీ..ఇవీ

  •  చౌటుప్పల్‌లో మాట్లాడిన భువనగిరి పార్టీ అభ్యర్థి బూర పలుమార్లు తన ప్రసంగంలో హీరో బాలకృష్ణ, పవన్‌కల్యాన్‌ డైలాగ్‌లతో అలరించారు. కాంగ్రెస్‌ నాయకులు బాహుబలులు కారని విమర్శించారు.
  • నడ్డా తన ప్రసంగంలో ఎయిమ్స్‌తో పాటూ నవరత్నాలు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు.
  • ఎండలో సైతం చౌటుప్పల్‌, నల్గొండ సభలకు భారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.
  • నడ్డా మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు యువత మోదీ...మోదీ అంటూ నినాదాలు చేశారు. పార్టీ జెండాలు ఊపారు.
  • రెండు ప్రాంతాల్లోనూ షెడ్యూల్‌ కంటే సుమారు రెండు గంటలు ఆలస్యంగా సభలు జరిగాయి.
  • పార్టీ జాతీయ అధ్యక్షుడు రావడంతో స్థానిక పోలీసులతో పాటూ కేంద్ర బలగాలు భారీ బందోబస్తును ఏర్పాటు చేశాయి.

    అభివృద్ధిపై చర్చకు సిద్ధం : సైదిరెడ్డి

గత కాంగ్రెస్‌, భారాస హయాంలో నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధికి, గత పదేళ్లలో భాజపా హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీ నుంచి ప్రస్తుత ఎంపీ అభ్యర్థి రఘువీర్‌ వరకు అందరూ తాత, తండ్రుల పేరు చెప్పి వస్తున్నారు. వారేం చేశారో ప్రజలు నిలదీయాలి. ఒకప్పుడు కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ గడ్డగా ఉన్న నల్గొండపై కాషాయ జెండా ఎగురేస్తాం. ఈ దఫా రెండు లక్షల మెజార్టీతో గెలుపు ఖాయం. ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి పరిశ్రమలతో పాటూ, డ్రైపోర్టు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. ఈ ఎన్నికల్లో భారాసకు ఓటేస్తే మూసీలో వేసినట్లే.


మోదీ అంటేనే దేశం, ధర్మం, అభివృద్ధి
డా.బూర నర్సయ్యగౌడ్‌

మోదీ అంటేనే దేశం, ధర్మం, అభివృద్ధి. పదేళ్ల మోదీ పాలనలో దేశంలో వందేళ్ల అభివృద్ధి జరిగింది. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించిన ఘనత ఆయనదే.  తాను రోజుకు రూ.లక్షన్నర ఆదాయం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నాను. మోదీ ప్రభుత్వం అందించిన సహకారంతో అయిదేళ్లలో రూ.9వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించాను. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని