logo

అగ్రనేతలొస్తున్నారు..!

మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి.

Published : 09 May 2024 06:58 IST

నేడు భువనగిరికి అమిత్‌షా, 10న నల్గొండకు ఖర్గే రాక

ఈనాడు, నల్గొండ : మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. భాజపా నుంచి ఆ పార్టీ  అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేయగా..కాంగ్రెస్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి ప్రచారం చేశారు. భారాస బస్సుయాత్రను మాజీ సీఎం కేసీఆర్‌ మిర్యాలగూడ నుంచే ప్రారంభించి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. చివరి దశలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భాజపా  ఆ పార్టీ కేంద్ర అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది.

  •  భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేడు భువనగిరిలో ప్రచారం చేయనున్నారు. పురపాలిక పరిధి రాయిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు సభకు చేరుకొని 12 గంటల వరకు సభలో పాల్గొంటారు. ప్రధానంగా తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. అమిత్‌ షా రాక నిమిత్తం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌తో పాటూ రహదారి మార్గాన్ని కేంద్ర బలగాలు బుధవారం పరిశీలించాయి. సభ ఏర్పాట్లను బూర నర్సయ్యతో పాటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌ తదితరులు పరిశీలించారు. 10న సూర్యాపేటలో నిర్వహించే భాజపా రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌కు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు హాజరవుతారని లోక్‌సభ అభ్యర్థి సైదిరెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు.
  • నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 10న నల్గొండకు రానున్నారు. మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సభను విజయవంతం చేయాలని.. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే ఎక్కవ మెజార్టీ వచ్చేలాగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ నెల 11న భువనగిరికి ప్రియాంక గాంధీ వస్తారని పార్టీ వర్గాలు ప్రాథమికంగా చెబుతున్నా ఇంకా ఖరారు కాలేదని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి.
  • చివరి రోజు ప్రచారంలో భాగంగా ఈ నెల 11న నల్గొండలో నిర్వహించే కార్నర్‌ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి పాల్గొంటారని ప్రాథమిక సమాచారం. ఈ పర్యటనపై నేడు స్పష్టత రానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. భువనగిరిలో నిర్వహించే ప్రచారానికి మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని