logo

108 సేవలకు సుస్తీ!

జిల్లాలో ‘108’ అంబులెన్స్‌ సేవలు మొక్కుబడిగా మారాయి. వాహనాల్లో చాలా వరకు మందులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో పేదలకు వైద్య సేవలు కొరవడుతున్నాయి.

Published : 26 Jan 2023 01:58 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

జిల్లాలో ‘108’ అంబులెన్స్‌ సేవలు మొక్కుబడిగా మారాయి. వాహనాల్లో చాలా వరకు మందులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో పేదలకు వైద్య సేవలు కొరవడుతున్నాయి. సకాలంలో రాకపోవడంతో పాటు ప్రాథమిక చికిత్స అందించడానికి అవసరమైన వైద్యపరమైన కిట్లు లేకపోవడం గమనార్హం.

జిల్లాలో సుమారు 40 అంబులెన్సులు అందుబాటులో ఉండగా- వాటిని నడిపే డ్రైవర్లు, ఇతర సిబ్బందికి జీతాలు సక్రమంగా అందడం లేదు. దీంతో పాటు కొత్తగా చేరిన వారి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ రెండు రోజుల కిందట కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. వాహనాలు పాత పడటం, నిర్వహణ లోపం, మరమ్మతుల్లో జాప్యం తదితరాలనూ ఏకరవు పెట్టారు. జిల్లాలో నియోనాటల్‌ కింద కేటాయించిన దానితో కలిపి మొత్తం 40 అంబులెన్సులు ఉండగా- వీటిలో 5 లక్షలకుపైగా తిరిగినవీ ఉన్నాయి. సాధారణంగా 2.5 లక్షల కి.మీ. ప్రయాణం, 15 ఏళ్లు దాటిన అంబులెన్సులను పక్కన పెట్టాలి. కానీ, జిల్లాలో వాటిని వినియోగిస్తున్న పరిస్థితి.

మందులు అరకొరే...

ప్రమాద బాధితులను, ప్రాణపాయ స్థితిలో ఉన్న  వారికి సకాలంలో సేవలందించడంలో 108 వాహనాల పాత్ర ఎనలేనిది. అందుకే, కాల్‌ అందుకున్నప్పటి నుంచి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లే వరకు సమయం నిర్దేశించారు. జిల్లాలో చాలా వాహనాలు 10 నుంచి 30 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు అంబులెన్స్‌లో మెడికల్‌ కిట్‌ను నెలకోసారి అందిస్తారు. దీనికింద ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు, పరికరాలు ఇస్తారు. గత కొద్ది రోజులుగా సక్రమంగా రావడం లేదని, చివరకు గ్లౌజులు, సిరంజిలు, దూది తదితరాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయని చెబుతున్నారు. దీంతో పాటు వాహనాల్లో వైద్య పరికరాల ఛార్జింగ్‌కు అవసరమైన బ్యాటరీలు బాగోలేవు. కలిగిరిలో ఉన్న వాహనానికి స్టార్టింగ్‌ ఇబ్బందులు ఉన్నాయి. అవసరమైన సమయంలో తోయాల్సి వస్తోంది. మధుమేహ పరీక్షలకు అవసరమైన గ్లూకోస్ట్రిప్స్‌, లాన్‌సెట్లు అందుబాటులో లేవని, క్షతగాత్రులకు అవసరమైన డ్రెస్సింగ్‌ ప్యాడ్స్‌, స్టెరిలైజ్డ్‌ దూది అయోడిన్‌ సైతం కరవు అవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.

అంబులెన్స్‌ లోపల పరిస్థితి

ఆలస్యం

అన్ని మండలాల్లో 108 వాహనాలు ఉండగా- సగానికి పైగా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఒక దానికి రిపేరు వస్తే.. మరొకటి అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలు ఆలస్యమవుతున్నాయి. ఉదయగిరి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ ఈ నెల 17న అనారోగ్య బాధితుడిని ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డీజిల్‌ కొట్టించుకునేందుకు పెట్రోల్‌ బంకుకు వెళ్లగా.. మరో వాహనం ఢీకొంది. అప్పటి నుంచి ఉదయగిరిలో 108 అందుబాటులో లేదు. సమీప దుత్తలూరు మండలంలోని వాహనాన్ని బ్యాకప్‌గా ఉంచామని అధికారులు చెబుతున్నా.. ప్రయోజనం లేదని స్థానికులు చెబుతున్నారు. బాధితులను ఆసుపత్రులకు చేర్చడంలో ఆలస్యమవుతోందని అంటున్నారు.

అధ్వానం

నిబంధనల ప్రకారం... 70వేల కి.మీ. తిరిగిన తర్వాత అంబులెన్స్‌లకు టైర్లు మార్చాలి. జిల్లాలోని రోడ్ల దెబ్బకు 50వేల కి.మీ.కే అవి అధ్వానంగా తయారవుతున్నాయి. పూర్తిగా అరిగిపోయి.. కొన్నింటికి చువ్వలు బయటకు వచ్చాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం అయిదు వాహనాలు ఉండగా- అన్నీ 95వేలు దాటినవే. అత్యవసర సమయాల్లో రోగులను తీసుకువెళ్లేటప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో.. ఏమోనని భయపడుతున్నారు. ఊహించని ఘటన జరిగితే రోగితో పాటు వాహనంలోని సిబ్బందికి ముప్పు వాటిళ్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవస్థ

జిల్లాకు 2020లో కొత్తగా వాహనాలు వచ్చాయి. వీటితో పాటు దాదాపు అన్నింటికీ రవాణాశాఖ నుంచి సామర్థ్య ధ్రువీకరణ పత్రం తీసుకోలేదు. కనీసం అధికారుల దగ్గర పరీక్షలు చేయించుకోలేదు. కాలం చెల్లిన వాటిలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులను తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తీసుకువెళ్లడంలోనూ అదే పరిస్థితి నెలకొంది. కొన్ని తరచూ మొరాయిస్తుండటంతో పక్క మండలాల నుంచి పిలవాల్సి వస్తోంది.  


ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

- పవన్‌కుమార్‌, డీఎం, 108 పథకం

జిల్లాలోని పాత వాహనాల్లో కాస్త ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మందులను ఇటీవల అందజేస్తున్నాం. పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపించాం. వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది.

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు