logo

పెద్దాసుపత్రి.. సేవల్లో ఏదీ దీప్తి!

మా పాపకు జ్వరం.. దానికి తోడు వాంతులతో నీరసంగా ఉండటంతో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఓ వైద్యుడు పరీక్షించి.. పైన వార్డులో అడ్మిట్‌ చేయించారు.

Published : 29 Jan 2023 02:07 IST

వేధిస్తున్న కీలక వైద్యుల కొరత

మా పాపకు జ్వరం.. దానికి తోడు వాంతులతో నీరసంగా ఉండటంతో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఓ వైద్యుడు పరీక్షించి.. పైన వార్డులో అడ్మిట్‌ చేయించారు. ఆ రోజు రాత్రి జ్వరంగా ఉందని నర్సులకు చెబితే ఓ ఇంజక్షన్‌ వేశారు. ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోలేదు. శనివారం తెల్లవారుజామున పాప చనిపోయిందని చెప్పారు. వైద్యులు సక్రమంగా పట్టించుకుని ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది.

చిన్నారి తల్లి ఆదిలక్ష్మి, మేనమామ నారాయణ


పాము కాటుకు గురై రాత్రి పది గంటల సమయంలో ఏరియా ఆసుపత్రికి వెళితే... ఆ సమయంలో అత్యవసరం అందాల్సిన వైద్య సేవలు సక్రమంగా అందలేదు. ఒంగోలు రిమ్స్‌కు సిఫార్సు చేశారు. అక్కడికి వెళ్లేలోపు మా బంధువు మృతి చెందాడు.

జనవరి 25న పాము కాటుతో మృతి చెందిన మణికంఠారెడ్డి బంధువుల ఆరోపణ.


తొక్కిసలాటలో కొందరు మృతి చెందారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొందరిని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ తగినంత మంది వైద్య సిబ్బంది, వసతులు ఉంటే.. అంతమంది చనిపోయి ఉండేవారు కాదు..

సంఘటనపై విచారణకు వచ్చిన ఏకసభ్య కమిషన్‌కు సీనియర్‌ సిటిజన్‌ వాంగ్మూలం.


ఆసుపత్రిలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్‌ ఒకరు. గైనకాలజీలో ఇద్దరు వైద్యులు లేరు. మత్తు వైద్యం కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. రోజు రోజుకూ ఓపీలు పెరుగుతున్నాయి. వైద్యులు కొరత ఉంది. ఉన్నవారిపైనే ఒత్తిడి అధికమవుతోంది.

ఏరియా ఆసుపత్రిలో పనిచేసే ఓ వైద్యుడి ఆవేదన.


కందుకూరు ప్రాంతీయ ఆసుపత్రి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కందుకూరు ఏరియా ఆసుపత్రి.. పేరుకు పెద్ద ఆసుపత్రి.. రోగులకు అందుతున్న సేవలు మాత్రం అంతంత మాత్రమే.. ఆపత్కాలంలో.. అత్యవసరమై వెళ్లిన వారికి సరైన వైద్యం అందడం లేదని రోగులు, వారి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. సుమారు 11 మండలాలకు వంద పడకల ఆసుపత్రిగా ఉన్నా.. వైద్యుల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం తదితరాలతో ఇటీవల విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నాడు-నేడు కింద ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా.. ఆచరణలో సేవలు శూన్యమన్న అపవాదు నెలకొంది.

కీలక పోస్టులు ఖాళీ..

ఆసుపత్రి.. 1999లో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెంది.. కొన్నేళ్లు ఓ మోస్తరుగానే సేవలందించింది. అనంతరం ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకొచ్చి వసతులు, వైద్య పరికరాలు సమకూర్చడం.. వైద్యుల నియామకంతో రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రోజుకు సుమారు 400కుపైగా ఓపీ, 100 నుంచి 120 వరకు ఇన్‌ పేషంట్లు ఉంటున్నారు. సాధారణ జ్వరాలు, ప్రసూతి, చిన్న పిల్లల వైద్య సేవల కోసం ఆసుపత్రికి అధికంగా వస్తుంటారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 24 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా- కీలకమైన 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయిదుగురు సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు ఉండాల్సి ఉండగా- 2 పోస్టులు ఖాళీ.. ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, రేడియాలజీ, సీఎస్‌ ఆర్‌ఎంవో, డ్యూటీ డాక్టర్‌(డీడీఎంవో), అనస్థీషియన్‌తో పాటు కీలకమైన జనరల్‌ సర్జన్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఆసుపత్రి అడ్మిన్‌, కార్యాలయ సూపరింటెండెంట్‌ పోస్టులదీ అదే పరిస్థితి అని సమాచారం. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఇతర చికిత్స కోసం వచ్చే వారికి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు సేవలందిస్తుండటం గమనార్హం. అత్యవసర సమయాల్లో వారే వైద్యులుగా మారి.. కుట్లు వేయడం.. కట్లు కట్టడం చేస్తున్నారు.

ప్రాథమిక చికిత్సలకే పరిమితం

ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు ఉండగా- రోజుకు 60 నుంచి 70 వరకు ఓపీ, 20 నుంచి 30 వరకు ఇన్‌ పేషంట్లు ఉంటున్నారు. వీరిని ఉదయం, సాయంత్రం పరీక్షించాల్సి ఉంది. కాగా, ఇక్కడ పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరిని సోమ, మంగళవారాల్లో, మరొకరిని శుక్ర, శనివారాల్లో వింజమూరు పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కీలకమైన చిన్నపిల్లల విభాగంలో వారంలో నాలుగు రోజులు ఒక్కరే అందుబాటులో ఉంటున్నారు. రక్త నిల్వ కేంద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులోనూ ఎవరూ లేరు. ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ కూడా లేరు. ప్రసూతీ విభాగంలో గతంలో నలుగురు వైద్యులు ఉండగా.. ఒకరిని బదిలీ చేశారు. మరొకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో ఇద్దరు మాత్రమే ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితుల కారణంగా ఇంత పెద్ద ఆసుపత్రి కేవలం ప్రథమ చికిత్సలకే పరిమితమవుతోంది. అధికశాతం ఒంగోలు రిమ్స్‌కు సిఫార్సు చేస్తుండగా.. రోగులను అక్కడికి తీసుకువెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు.


కొరత నిజమే.. నివేదించాం
- డాక్టర్‌ శకుంతల, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. జనరల్‌ మెడిసిన్‌, సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు, ఎలక్ట్రీషియన్‌ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నాం. నర్సులు, సిబ్బంది సరిపడా ఉన్నారు. మందుల కొరత లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని