logo

ఇరవై ఏళ్లుగా అన్నదానం

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రాంగణం.. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన ఖిల్లా రఘునాథాలయం ఇందూరుకే తలమానికంగా నిలుస్తోంది.

Published : 23 May 2024 02:28 IST

ఖిల్లా రఘునాథాలయంలో భక్తులకు భోజనాలు వడ్డిస్తున్న ప్రతినిధులు 

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రాంగణం.. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన ఖిల్లా రఘునాథాలయం ఇందూరుకే తలమానికంగా నిలుస్తోంది. నిత్యపూజలతో పాటు ప్రతి శనివారం విశేష అర్చనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం అన్నదానం అందిస్తున్నారు. ఇందుకోసం ఇరవై ఏళ్ల క్రితమే కొందరు భక్తులు శ్రీరామ అన్నప్రసాద కమిటీ నెలకొల్పి ప్రతివారం అన్నదానం చేస్తున్నారు.

సభ్యులే ముందుగా..

ఆలయంలో శనివారం అర్చనలు, మంగళహారతులు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది  భక్తులు తరలివస్తారు. ఎత్తయిన కొండ ఉండటం, పూజలు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం అవుతుండటంతో అన్నదానం ఏర్పాటు చేయాలని కొందరు భక్తులు భావించారు. 2003లో విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు కలిసి ప్రత్యేకంగా శ్రీరామ అన్నప్రసాద కమిటీ ఏర్పాటు చేశారు. అశోక్‌కుమార్‌ కన్వీనర్‌గా, సుభాష్, రాజేంద్రప్రసాద్, బంటు రాము, శివ తదితరులు దీనిని ప్రారంభించారు. అన్నదానం కోసం రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇందు కోసం సొంతంగా నిధులు జమ చేసుకునే వారు. తర్వాత కాలంలో మరికొందరు వారిని ప్రోత్సహించారు. పుట్టిన రోజు, పెళ్లిరోజు, బారసాల, శుభకార్యాలు, సత్యనారాయణ వ్రతం చేసుకునేవారు అన్నదానానికి సహకరిస్తున్నారు.


రాములోరి సేవలో తరించాలని..
- అశోక్‌కుమార్, కమిటీ కన్వీనర్‌ 

ఇది జిల్లాలోనే గొప్ప మందిరం. రాములోరి సేవలో తరలించాలని అన్నదానం కోసం మిత్రులందరం కలిసి 20 ఏళ్ల క్రితం కమిటీ ఏర్పాటు చేశాం. చాలా ఏళ్లుగా మేమే సొంతంగా నిధులు సమకూర్చుకొని కొనసాగిస్తున్నాం. దాతలు ఎవరూ ముందుకు రాని సందర్భంలో మా కమిటీ ప్రతినిధులు లింగం, దిలీప్, నర్సయ్య, రాకేశ్‌ పటేల్, దేవేందర్, రాజు, ఆనంద్, మాధవరావు, శంకర్, బాలరాజు, పోశెట్టి, వీరేశం డబ్బులు వెచ్చిస్తారు. మా పిల్లల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని