logo

రాష్ట్రంలో ప్రథమం..

అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా విద్య, ఎస్సీ సంక్షేమశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

Published : 22 Jan 2022 03:30 IST

ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాల్లో జిల్లా ఆదర్శం
న్యూస్‌టుడే బాన్సువాడ

అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా విద్య, ఎస్సీ సంక్షేమశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యాచరణ విజయవంతానికి తగు దిశానిర్దేశం చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి వార్డెన్‌కు ఒక మండలాన్ని అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను గుర్తించి ఉపకార వేతనంతో పొందే లబ్ధిని తెలియజేశారు. అర్హత కలిగిన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ఏడాది 791 మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది ఇప్పటికే 4,074 మంది చేరారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. ఒక్క సమావేశం ఎంతటి మార్పును తీసుకొచ్చిందో అర్థమవుతోంది. ఇది అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.

జుక్కల్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనంపై అవగాహన కల్పిస్తున్న వార్డెన్‌ ప్రవీణ్‌

లబ్ధి ఇలా..
ఎస్సీ విద్యార్థులు  చదువును మధ్యలో నిలిపివేయవద్దని ప్రభుత్వం ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనం పథకం తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో  ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఏడాదికి బాలికలకు రూ.1500, బాలురకు రూ.1000, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రూ.3000 ఇవ్వనున్నారు. ఆదాయం, కుల, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా పత్రాలు తీసుకొని మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారుల ఆమోదం అనంతరం విద్యార్థుల ఖాతాలో నగదు జమవుతుంది.


పాలనాధికారి చొరవతో...
- రజిత, ఎస్సీ సంక్షేమ జిల్లా అధికారిణి

ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనం చాలా మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేదు. ఇది తెలిసిన పాలనాధికారి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అందరం కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించాం. ప్రతి వార్డెన్‌కు ఒక మండలాన్ని కేటాయించి అక్కడి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాం. సమష్టి కృషితో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని