logo

అయినవారే అంతమొందిస్తున్నారు

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో భూతగాదా విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకొని శుక్రవారం సతీష్‌ అనే యువకుడు తన తండ్రి అబ్బయ్యతో పాటు చిన్నాన్న నడిపి సాయిలును పారతో కొట్టి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. రక్షణగా ఉండాల్సిన రక్త సంబంధీకులే కాలయములుగా

Updated : 13 Aug 2022 06:44 IST

మంటగలుస్తున్న మానవ విలువలు
పెరుగుతున్న కుటుంబ నేరాలు

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో భూతగాదా విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకొని శుక్రవారం సతీష్‌ అనే యువకుడు తన తండ్రి అబ్బయ్యతో పాటు చిన్నాన్న నడిపి సాయిలును పారతో కొట్టి ప్రాణాలు తీయడం కలకలం రేపింది.
రక్షణగా ఉండాల్సిన రక్త సంబంధీకులే కాలయములుగా మారి కాటికి పంపుతున్నారు. కంటికి రెప్పలా కాపాడిన తండ్రినే నరికి చంపుతున్నారు. పురిటి నొప్పులకోర్చి జన్మనిచ్చిన తల్లినే కడతేరుస్తున్నారు. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములు గుంట భూమికోసం ప్రాణాలు బలితీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తని ప్రియుడితో కలిసి అంతమొందించిన భార్య.. తన బంధానికి అడ్డొస్తుందని కన్న కూతురినే నలిపేసిన తల్లి.. అనుమానంతో కడుపున పుట్టిన బిడ్డను చిదిమేసిన తండ్రి.. ఇలా రక్త సంబంధాలకు మచ్చ తెచ్చే ఉదంతాలతో మానవ విలువలు మంట గలుస్తున్నాయి. తల్లీ-బిడ్డ, తండ్రీ-కొడుకు, భార్యా-భర్త, మామా-అల్లుడు, అన్నా-తమ్ముడు.. బంధమేదైనా రక్త చరిత్ర రాస్తున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. చిన్న తగాదాలకే తలలు పగలగొట్టి చంపుకొనే విష సంస్కృతికి బీజం వేయడంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బాంధవ్యాలకు విలువనిచ్చే ఆరోగ్యకరమైన సమాజం వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉంది.

బంధాలకు విలువ  పెంచితేనే..
బాంధవ్యాల విలువలు నేర్పేవారు లేకపోవడంతో ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇంట్లోని వృద్ధులు.. చుట్టరికాల ప్రాధాన్యం తెలుపుతూ విలువలు నేర్పిస్తుంటారు. ఈ వ్యవస్థ ఛిన్నాభిన్నమవడంతో భావితరాలకు బంధాల విలువలు చెప్పేవారే లేకుండా పోయారు. ప్రస్తుతం బంధుత్వాలు కృత్రిమంగా మారిపోవడంతో మారణహోమం చెలరేగుతోంది. అయినవారిపై అఘాయిత్యాలను నియంత్రించేలా స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు అవగాహన సదస్సులు, కళాజాత ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
చైతన్యం తెస్తాం
- శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి జిల్లా

రక్త సంబంధాలపై ప్రజల్లో  అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతాం. జీవితం విలువలు తెలిపే విధంగా ప్రజాసంబంధాలపై గ్రామాల్లో చైతన్యం తెస్తాం. అవకాశం  దొరికినప్పుడల్లా చుట్టరికాలు, మానవ సంబంధాలు,  ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రయోజనాలపై కళాజాతల ద్వారా తెలియజేస్తున్నాం.


మచ్చుకు కొన్ని ఘటనలు
ఠాణా పరిధి      ఎవరు ఎవరినంటే..
* మద్నూర్‌     పతిని హతమార్చిన పత్ని
* బిచ్కుంద     కొడుకు చేతిలో తండ్రి హతం
* రామారెడ్డి     కొడుకే తండ్రి ఊపిరి తీశాడు
* బీర్కూర్‌       భార్యను భర్తే హతమార్చాడు
* కామారెడ్డి     పాత కక్షలతో స్నేహితుడి ప్రాణం తీశారు
* మాచారెడ్డి       పైసల కోసం బావను కడతేర్చాడు
* కామారెడ్డి      తాగుడుకు బానిసైన భర్తను భార్యే హత్య చేసింది  
* మాక్లూర్‌        ప్రియుడితో కలిసి భర్తను బలితీసుకుంది
* నాగిరెడ్డిపేట      అక్రమ సంబంధం బయట పడుతుందని బాలుడి హత్య
* నస్రుల్లాబాద్‌     డబ్బుల విషయంలో సొంత తమ్ముడిని హత్య చేశాడు
* నాగిరెడ్డిపేట     పింఛను డబ్బులు ఇవ్వలేదని కన్నకొడుకే తండ్రిని కాటికి పంపాడు
* నవీపేట       భార్యాభర్తల తగాదాల్లో.. మామను కోడలు పుట్టింటివారు కొట్టి చంపారు
* దోమకొండ     ఆస్తి విషయంలో తోడబుట్టిన అన్నను తన భార్యతో కలిసి తమ్ముడే కడతేర్చారు
* దేవునిపల్లి       భర్త తాగుడుకు బానిసయ్యాడని భార్యే తన తల్లిదండ్రులతో కలిసి అతని ప్రాణాలు తీసింది
* గాంధారి      అక్రమ సంబంధం బయట పడుతుందని పెంచుకుంటున్న కొడుకును స్వయాన పెద్దమ్మే చిదిమేసింది
* నిజామాబాద్‌     వరుసకు సోదరుడైన వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అతణ్ని భర్తే అంతమొందించాడు



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని