logo

సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం

రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Published : 28 Mar 2024 03:37 IST

నిజాంసాగర్‌ ద్వారా 1.15 లక్షల ఎకరాలకు సరఫరా
ఈనాడు, కామారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారబందీ పద్ధతి అమలుతో పాటు పొదుపుగా నీటి వినియోగం కారణంగా ఉమ్మడి జిల్లా వరదాయినిగా పేరుగాంచిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 5.97 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 1.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిపారుదల శాఖ అధికారులు సాగునీటిని సరఫరా చేశారు. చివరి విడతగా ఈ నెలాఖరు వరకు విడుదల చేయనున్నారు. తుదకు ప్రాజెక్టులో మరో నాలుగు టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండనున్నాయి.

ఆరువిడతల్లో  9.36 టీఎంసీలు

ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఆయకట్టుకు ఆరువిడతల్లో 9.36 టీఎంసీల నీటిని సరఫరా చేశారు. చివరి విడతలో మరో 1.4 టీఎంసీ విడుదల చేయనున్నారు. వానాకాలం చివర్లో కురిసిన భారీవర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి పూర్తిస్తాయి నీటిమట్టానికి నీటి నిల్వలు చేరుకున్నాయి. అలీసాగర్‌ వరకు 49వ డిస్ట్రిబ్యూటరీ వరకు ప్రారంభంలో సాగునీటిని సరఫరా చేశారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం 38వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీటిని అందిస్తున్నారు. ఇదే విధంగా బోధన్‌ పట్టణ అవసరాల కోసం బెల్లాల్‌ చెరువుకు సైతం నీటిని అందించారు.

వారబందీ పద్ధతిలో..

యాసంగి సీజన్‌ ప్రారంభంలో ప్రాజెక్టులో 12 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. వారబందీ పద్ధతిని అమలు చేసి పదిహేను రోజులకోసారి నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద పంటలకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ఆయకట్టు పరిధిలో మెజారిటీ రైతులు బోరుబావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు. కేవలం మొదటి ఆయకట్టు రైతులు మాత్రమే పూర్తిగా ప్రాజెక్టు నీటి మీదనే ఆధారపడుతున్నారు. వీరికి మాత్రమే విడతల వారి సాగునీటి సరఫరాతో కొంత మేర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.


పూడిక తొలగిస్తే పెరగనున్న నిల్వలు

రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా గోదావరి జలాలను హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తరలించారు. ఆశించిన స్థాయిలో సాగునీరు చేరకపోవడంతో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుంచి హల్దీవాగు ద్వారా కాళేశ్వరం జలాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో నిజాంసాగర్‌కు గోదావరి జలాల తరలింపు సాధ్యమయ్యేలా కనపడడం లేదు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వచ్చిన వరద నీటిని నిల్వ చేసుకుంటేనే ఆయకట్టు కింద రెండు పంటలు పండనున్నాయి. ఏటా ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతున్న నేపథ్యంలో.. ఒకసారి ప్రాజెక్టు నిండితే రెండు పంటలు పండేలా లేవు. దీంతో ప్రాజెక్టులో పూడిక తొలగింపునకు ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవసరం ఉంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తేనే నిధులు మంజూరై పూడిక తొలగింపు పనులు ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని