logo

శతశాతంతో శెభాష్‌ అనిపించారు

ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు.

Published : 05 May 2024 06:20 IST

 కార్పొరేటుకు దీటుగా ఎంజేపీ ఫలితాలు

 న్యూస్‌టుడే, భిక్కనూరు: ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. అంతేకాదు 2021- 22 విద్యా సంవత్సరంలో 10 మంది, 2022- 23లో 14 మంది 10 జీపీఏ సాధించి ఔరా అనిపించారు. ఎక్కువ మంది పది జీపీఏలతో పాటు మూడేళ్లుగా ఆ పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించి స్ఫూర్తిగా నిలుస్తోంది.

 కార్పొరేట్‌ చదువులకు దీటుగా మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వంటివి విద్యార్థులు ఎదిగేందుకు దోహదపడుతున్నాయి. చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం వంటి వాటిల్లో మెలకువలు నేర్పుతున్నారు. ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ఎంజేపీ పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు.

20 మందికి పది జీపీఏ

కామారెడ్డి జిల్లాలో మొత్తం 8 ఎంజేపీ పాఠశాలలున్నాయి. ఒకదాంట్లో ఏడో తరగతి వరకు విద్యార్థులు ఉండగా మిగితా ఏడు పాఠశాలల్లో మొత్తం 455 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. 2023- 24 విద్యా సంవత్సర ఫలితాల్లో వీరంతా ఉత్తీర్ణత సాధించారు. 20 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు పొందారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అంతా కలిసి సమష్టి కృషి చేశారు. పరీక్షల కంటే 60 రోజుల ముందు నుంచే ప్రణాళిక రూపొందిస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు, నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు.  

సాఫ్ట్‌వేర్‌ కంపెనీతో ఎంవోయూ..

జంగంపల్లి ఎంజేపీ పాఠశాల యాజమాన్యం 2022లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాగ్నిజెంట్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు కంపెనీ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ‘మైండ్‌స్పార్క్‌’ అనే పేరుతో గణితం, సైన్స్‌ విభాగాల్లో నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. ఇండస్ట్రియల్‌ టూర్‌లో భాగంగా పిల్లలను ప్రత్యక్షంగా పలు కంపెనీలకు తీసుకెళ్లి అక్కడి కార్యక్రమాలు, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆంగ్ల భాషపై పట్టు పెంచేలా తర్ఫీదునిస్తున్నారు. పాలిటెక్నిక్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.


సమష్టి కృషి..
మనుదీప్తి, ఎంజేపీ విద్యాసంస్థల జిల్లా కోఆర్డినేటర్‌

విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడేలా తయారు చేస్తున్నాం. చదువుతో పాటు సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం,    సమాజంలో పోటీని తట్టుకునేలా ఆత్మస్థైర్యం పెంపొందిస్తున్నాం. నాయకత్వ లక్షణాలు అలవడేలా ఎన్నికలు నిర్వహిస్తాం. సమష్టి కృషితోనే మంచి ఫలితాలు సాధిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని