logo

వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు

పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 05 May 2024 06:28 IST

ఉత్తర్వులు జారీ చేసిన పురపాలిక శాఖ

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం: పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక కమిషనర్లు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. అందుకు అవసరమైన సూచనలు ఉత్తర్వులో ప్రస్తావించారు. ప్రిసైడింగ్‌ అధికారిగా సీనియర్‌ మహిళా ఉద్యోగిని నియమించాలి. ఒకవేళ సీనియర్‌ ఉద్యోగి లేని పక్షంలో ఇతర కార్యాలయాల నుంచి ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు సభ్యులుగా మహిళల కోసం పనిచేసే, న్యాయపరమైన అవగాహన, సామాజిక సేవా అనుభవం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వేతర సంస్థల నుంచి అతివల కోసం పని చేసే ఒక మహిళను నియమించుకోవాలని సూచించారు. కమిటీలను ఎప్పటిలోగా నియమించాలనే అంశంపై స్పష్టత లేకపోయినా ఏప్రిల్‌ 29న ఉత్తర్వు జారీ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడానికి 2013లో వచ్చిన చట్టాన్ని అనుసరించి వివిధ సెక్షన్లను ప్రస్తావిస్తూ కమిటీల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలిచ్చింది. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్యాలయంతో పాటు క్షేత్రస్థాయిలో మహిళలు వివిధ స్థాయుల్లో పనిచేస్తున్నారు. వారికి ఈ కమిటీలు రక్షణ కల్పించే ఆస్కారముంది. అయితే అంతర్గత కమిటీలు నామమాత్రంగా కాకుండా భరోసా కల్పించే విధంగా ఉండాలన్నది ఉద్యోగుల వాదన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని