logo

అడ్డూఅదుపూ లేని అక్రమ దందా

డిచ్‌పల్లిలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిర్మాణాలు, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.

Published : 09 May 2024 02:55 IST

డిచ్‌పల్లి కేంద్రంగా మొరం తరలింపు

మెంట్రాజ్‌పల్లి శివారు సాంపల్లి మేలయతండా ప్రాంతం నుంచి టిప్పర్లలో తరలిస్తున్న మొరం

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి: డిచ్‌పల్లిలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిర్మాణాలు, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అన్నీ తెలిసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండటంతో దందాకు అదుపు లేకుండా పోయింది. డిచ్‌పల్లిలో జరుగుతున్న మొరం అక్రమ వ్యాపారంపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

అనుమతికి మించి తవ్వకాలు

మెంట్రాజ్‌పల్లి శివారులో సాంపల్లితండా, సాంపల్లి పరిధిలో అసైన్డ్‌ భూముల్లో నాలుగైదు చోట్ల, యానంపల్లి శివార్లలో పెద్ద ఎత్తున మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయి. కొందరు వ్యాపారులు పట్టాదారు రైతు పేరుతో సొంత అవసరం నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేయించి అనుమతి పొందుతున్నారు. అనుమతి ఓ ప్రదేశంలో పొంది తవ్వకాలు మరోచోట సాగిస్తూ డిచ్‌పల్లితోపాటు నిజామాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులకు సహకరిస్తున్న ఓ ద్వితీయ శ్రేణి అధికారిపై ఇటీవల ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తహసీల్దార్‌ కార్యాలయంలో చర్చసాగుతోంది.

  • తాత్కాలిక అనుమతి పొందిన వ్యక్తి, కొనుగోలుదారు ఇద్దరి పేరు, చిరునామా ఒకటే చూపి వేరే ప్రాంతాలకు మొరం తరలిస్తున్నారు.
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే తవ్వకాలు చేపట్టాలని వేబిల్లులో స్పష్టంగా ఉన్నా వేకువజామునే టిప్పర్లలో తరలిస్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్‌ సంఖ్య లేని వాహనాలను తరలింపునకు వినియోగిస్తుండటం గమనార్హం.
  • రోజుకు ఒక టిప్పర్‌ రెండు లోడ్‌లతో రవాణాకు అనుమతి తీసుకొని అయిదారు ట్రిప్పులు తరలిస్తున్నారు.

రోడ్లు  ధ్వంసం..

అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలతో సాంపల్లి, మేలయతండా రోడ్డు ధ్వంసమైంది. వారి వాహనాలు సజావుగా వెళ్లడానికి వ్యాపారులు గుంతలు పడ్డచోట మొరం పోసి ట్యాంకరుతో నీళ్లు పట్టి రాకపోకలు సాగిస్తున్నారు. యానంపల్లి నుంచి సుద్దపల్లి ఎక్స్‌ రోడ్డు, లింగసముద్రం నుంచి కమలాపూర్‌ రోడ్డుపై చాలా చోట్ల గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ధ్వంసమైన సాంపల్లి మేలయతండా రోడ్డు

నిఘా పెడతాం

కొందరు రైతులు మొరం తవ్వకాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఒక్కరికి రోజులో ఒకే వే బిల్లు జారీ చేస్తున్నాం. నిఘాపెట్టి అనుమతికిమించి తరలిస్తే చర్యలు తీసుకుంటాం.

ప్రభాకర్‌, తహసీల్దార్‌, డిచ్‌పల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని