logo

ఎన్నికల ప్రచారం చివరి దశకు

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది.

Published : 09 May 2024 02:57 IST

పర్యటించని ప్రాంతాలపై పార్టీల దృష్టి

ఈనాడు, కామారెడ్డి: లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. మిగిలిన తక్కువ సమయంలో ముఖ్యనేతలను రప్పించి పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా మూడు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

అగ్రనేతల సభలు

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిల బహిరంగసభను ఈ నెల 11న కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేశారు. తుది రోజుల్లో ప్రచారాన్ని చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు.

పోల్‌మేనేజ్‌మెంటుకు రంగం సిద్ధం

పోల్‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా చేపట్టేందుకు అభ్యర్థులు, నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి పోలైన ఓట్లు ఎన్ని, ఏ ప్రాంతంలో తగ్గాయో బేరీజు వేసుకుంటూ ఆయా చోట్ల ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. పార్టీలు, కులాల వారీగా ప్రతీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కలు తీశారు. వీటి ఆధారంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్కడ ఎలా చేస్తే గెలుస్తామనే అంశంపై కసరత్తు చేపట్టి చివరి అంకం విజయవంతంగా పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మహిళా సంఘాల నాయకురాళ్లతో సైతం చర్చలు జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని