logo
Published : 06 Aug 2022 01:56 IST

ప్రమాదంలో ప్రజారోగ్యం

గొప్పలు చెప్పుకోవడానికి రూ.కోట్ల ఖర్చుతో ప్రకటనలు

దుయ్యబడుతున్న విపక్షాలు: సమర్ధించుకున్న మంత్రి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతిసారం, ఇతర అంటువ్యాధులు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దిద్దుబాటు చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. మరోవైపు అంతా బాగుందని, ఎంతో బాగుందంటూ డిజిట్‌ మాధ్యమాలు, వార్తా పత్రికల్లో నిత్యం ప్రకటనలు వెలువడుతున్నాయి. ప్రకటనల కింద నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం 7 ఏళ్లలో అక్షరాల రూ.400 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. దీనిపై  విపక్షాలు దుయ్యబడుతున్నాయి.

నియంత్రణలోకి రాని అతిసారం

అతిసారం బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య రెండంకెలకు పెరిగింది. చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య మూడుంకెలుగా ఉంది. రాయగడ, కొరాపుట్‌, నువాపడ, ఝార్సుగుడ, బౌద్ధ్‌ జిల్లాలకు అతిసారం విస్తరించింది. ప్రత్యేక వైద్య బృందాలను ఆయాచోట్ల నియమించామని, నీటి కాలుష్యం ఈ పరిస్థితికి కారణమని ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌ పునరుద్ఘాటిస్తున్నారు. కాశీపూర్‌, ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నా శాశ్వత చర్యలు కరవయ్యాయని విపక్షాలంటున్నాయి.

90 రోజుల్లో రూ.12.60 లక్షలు చెల్లింపు

ఆరోగ్యశాఖ స్వీయ వైఫల్యాల నుంచి బయట పడడానికి ఎంచుకున్న మార్గం ప్రసార సాధనాల ద్వారా గడిచిన 90 రోజుల్లో ‘అంతాబాగుంది’ అని చెప్పుకోవడానికి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలకు చెల్లించిన మొత్తం రూ.12.60 లక్షలు, పత్రికా ప్రకటనల కింద చెల్లించినది రూ.కోట్లలో ఉంది.


సొమ్ము వృథా

భాజపా అధికార ప్రతినిధి దిలీప్‌ మల్లిక్‌ గురువారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ నవీన్‌ ప్రభుత్వం చేసింది తక్కువ, చెప్పుకుంటున్నది ఎక్కువని ఎద్దేవా చేశారు. వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోని పాలకులు ప్రసారసాధనాలకు రూ.కోట్లు గుమ్మరించి ప్రకటనలు విడుదల చేస్తున్నారని, ప్రజాధనం ఇలా వృథా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.


ప్రజల కోసం ఖర్చు చేస్తే మేలు

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దేవాశిష్‌ పట్నాయక్‌ గురువారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రకటనల కోసం వెచ్చించిన రూ.700 కోట్లు ప్రజారోగ్యం కోసం వినియోగించి ఉంటే సొమ్ము సద్వినియోగం అయ్యేదన్నారు. బిజద పెద్దలు స్వీయ ప్రచారం కోసం ఆరాటపడుతున్నారని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. అంటువ్యాధులు తరచూ ఎందుకు ప్రబలుతున్నాయన్న దానిపై సమాధానం చెప్పని పాలకులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.


జనచైతన్యానికి ప్రకటనలు

ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌ గురువారం రాత్రి ఝార్సుగుడలో విలేకరులతో మాట్లాడుతూ... జన చైతన్యం కోసం ప్రకటనలు జారీ చేస్తున్నామన్నారు. ‘జనతాకు అచ్ఛీతరా సంఘాల్‌’ (జనాలకు బోధపరిచి చెప్పాలి) అంటూ ముఖ్యమంత్రి పునరుద్ఘాటిస్తున్నారని, ప్రసార సాధనాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. కొవిడ్‌ నియంత్రణలో ఒడిశా మంచి ఫలితాలు సాధించిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇతర సంస్థలు ప్రశంసించాయని, రాష్ట్రంలో వైద్య సేవలు భేషుగ్గా ఉన్నాయన్నారు. విపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని చెప్పారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని