logo

ఉత్తర బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం ఐఎండీ అధికారి ఉమాశంకర్‌ దాస్‌ శుక్రవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు

Published : 13 Aug 2022 02:30 IST

రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం

అఖువాపద వద్ద వైతరణి ప్రమాద స్థాయికి

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం ఐఎండీ అధికారి ఉమాశంకర్‌ దాస్‌ శుక్రవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తీర ప్రాంతాల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కెరటాల ఉద్ధృతి అధికంగా ఉంటుందన్నారు. 15 వరకు చేపల వేట నిషేధించినట్లు చెప్పారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శనివారం బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, కటక్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నందున ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు, సుందర్‌గఢ్‌, ఢెంకనాల్‌, అనుగుల్‌, ఝార్సుగుడ, పూరీ, ఖుర్ధా, కేంఝర్‌, దేవ్‌గఢ్‌, సంబల్‌పూర్‌, గంజాం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామని దాస్‌ తెలిపారు.
ఉత్తరకోస్తాలో నదులు ప్రమాదస్థాయికి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరకోస్తాలో ప్రవహిస్తున్న నదులు, ఉపనదులు ప్రమాదస్థాయికి చేరువలో ఉన్నట్లు జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీరు బిజయ్‌కుమార్‌ మిశ్ర శుక్రవారం విలేకరులకు చెప్పారు. పరిస్థితిపై నిఘా ఉంచామని, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. బాలేశ్వర్‌ వద్ద వైతరణి, జలకా, సాలంది, బుఢా బొలంగ నదులు ప్రమాదస్థాయికి చేరువలో ఉన్నాయి. కేంఝర్‌ జిల్లా అఖువాపద వద్ద వైతరణి ప్రమాద స్థాయి 17.68 మీటర్లు కాగా, ఇక్కడ జల ప్రవాహం 17.58 మీటర్లుగా ఉంది. సంబల్‌పూర్‌ (బుర్లా) వద్ద హిరాకుడ్‌ జలాశయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటి మట్టం 617.17 అడుగులుగా ఉంది. ఈ జలాశయం సామర్థ్యం 630 అడుగులు ఎగువ ప్రాంతం నుంచి సెకనుకి 2.90 లక్షల క్యూసెక్కులు నీరు హిరాకుడ్‌లో ప్రవేశిస్తోంది. ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ జెనా అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక గ్రామాల్లోని పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచారు. వరదలు అనివార్యమైతే ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని