logo
Published : 19 Aug 2022 03:25 IST

ఇంకా జలదిగ్బంధంలోనే గ్రామాలు

జగత్సింగ్‌పూర్‌ జిల్లా ఎరసమ వద్ద చిత్రోత్పల నది వరద

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అన్నదాతల బతుకులను వరదలు ముంచేశాయి. ఇటీవల వేసిన వరినాట్లు పూర్తిగా మునిగి పాడైపోయాయి. కూరగాయల పంటలు నాశనమయ్యాయి. పంట పొలాలు నదులను తలపిస్తున్నాయి. నష్టాలు అంచనాలకు అందనంతగా ఉన్నాయి. మరోవైపు ప్రజలు కూడా ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఉత్తర కోస్తా, పశ్చిమ ఒడిశా ప్రాంతాల్లో బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) కార్యాలయం అధికార వర్గాలు గురువారం ఉదయం వరద పరిస్థితి, సహాయ కార్యక్రమాలు, నష్టం తదితరాలను వివరించారు. కటక్‌ జిల్లా ముండలి వద్ద ఉదయం 11 గంటలకు మహానది ప్రవాహం 10,10,525 క్యూసెక్కులుగా ఉన్నట్లు జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీరు బిజయ్‌కుమార్‌ మిశ్ర విలేకరులకు చెప్పారు. జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గింది. దీంతో ముండలి వద్ద రానున్న 48 గంటల్లో ప్రవాహం 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు పరిమితమవుతుందన్న అంచనా ఉందన్నారు. ఇక్కడ ప్రవాహం తగ్గితే మహానది, ఉపనదులన్నీ శాంతిస్తాయన్నారు. ఇప్పటికే వరద నీరు సముద్రంలో ప్రవేశించినందున బుధవారంతో పోలిస్తే గురువారం పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. క్రమేణా ముంపులో ఉన్న గ్రామాల్లో వరద నీరు వీడుతుందని చెప్పారు. నదులకు గండ్లు పడినందున ఊళ్లు ప్రభావితమయ్యాయని, ఆయా చోట్ల తాత్కాలిక మరమ్మతులు జరిగినట్లు చెప్పారు.

బాధిత ప్రాంతాలకు మంత్రులు, అధికారులు
గురువారం విద్యాశాఖ మంత్రి సమీర్‌రంజన్‌ దాస్‌, పూరీ కలెక్టర్‌ సమర్ధవర్మతో కలసి పూరీలోని పిపిలి, నిమపడ, కొణాస, డెలాంగ్‌, సత్యబాది ప్రాంతాల్లో పర్యటించి బాధితుల ఇబ్బందులు అధ్యయనం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి రాణేంద్రప్రతాప్‌ స్వయిన్‌ కేంద్రపడ జిల్లా మర్సాఘాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. వరద పీడిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు, కలెక్టర్లు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.


ప్రస్తుత వరదల్లో 10 జిల్లాలకు చెందిన 1757 గ్రామాలు, 10 పట్టణాలు  ప్రభావితమయ్యాయి.
4.70 లక్షల మందికి ఆయాచోట్ల భోజనం, ఇతర సామగ్రి పంపిణీ చేస్తున్నారు.
మహానది, ఉపనదుల వరదలు తగ్గలేదు. కటక్‌, జగత్సింగ్‌పూర్‌, కేంద్రపడ, పూరీ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
వందలాది గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. పవర్‌ బోట్ల ద్వారా ఊళ్లలో సహాయ బృందాలు పంపిణీ చేస్తున్న రిలీఫ్‌ ఎటూ సరిపోవడం లేదని బాధితులంటున్నారు.


 

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని