logo

పాఠశాల విద్య ప్రశ్నార్థకమే

రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. మంచి భవితకు పునాది పడాల్సిన ప్రాథమిక విద్య అందని ద్రాక్షలా మిగులుతోంది.

Published : 24 Mar 2023 01:53 IST

11 వేలకు పైగా బడులకు విద్యుత్తు కరవు
మౌలిక వసతులు అంతంతమాత్రమే

రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న తరగతి గది

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. మంచి భవితకు పునాది పడాల్సిన ప్రాథమిక విద్య అందని ద్రాక్షలా మిగులుతోంది. రాష్ట్రంలో 11 వేలకుపైగా పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. రాష్ట్రంలో 6 వేలకు పైగా పాఠశాలలకు సరైన తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా భాజపా చీఫ్‌ విప్‌ మోహన్‌ చరణ్‌ మాఝి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విద్యాశాఖ మంత్రి సమీర్‌రంజన్‌ దాస్‌ వెల్లడించిన వివరాల్లో కింది అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో విద్యుత్తు సౌకర్యం లేకుండా 11,710 పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలలు సైతం ఉండడం గమనార్హం. వీటిలో 6,781 పాఠశాలలో సరైన తరగతి గదులు లేకపోగా, మరో 6,011 పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అనుగుణంగా లేకుండానే నడుస్తున్నాయి. క్రీడల అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చిస్తున్నట్లు సర్కార్‌ గొప్పలు చెప్పుకుంటున్నా ఇప్పటికే 21,065 బడులకు క్రీడా మైదానాలు లేకపోవడం బాధాకరం.

 సెకండరీ స్థాయిలో 27.26 శాతం డ్రాపౌట్లు

2021-22 విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో సున్నాగా నమోదైన డ్రాపౌట్లు, సెకండరీ విద్య స్థాయిలో 27.26 శాతంగా ఉన్నట్లు మంత్రి నివేదిక వెల్లడించింది. అదే ప్రాథమికోన్నత స్థాయి విషయానికొస్తే డ్రాపౌట్ల శాతం 7.32గా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అదే విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో స్థూల ప్రవేశాల నిష్పత్తి 100:32 కాగా, ప్రాథమికోన్నత స్థాయిలో 92:90, సెకండరీ స్థాయిలో 80:36గా ఉన్నట్లు నివేదిక బహిర్గతం చేసింది. ఈ సమస్యలపై సభలో మంత్రి దాస్‌ వివరణ ఇస్తూ.. పాఠశాలలో మౌలిక వసతుల సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు ప్రాతిపదనలు ఉంచుతామన్నారు. ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ) 2023-24లో ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదిస్తే తదుపరి సర్కార్‌ ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల భర్తీ అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ ఎనిమిదేళ్లలో 19,490మంది శిక్ష సహాయకులను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో నియమించినట్లు తెలిపారు. వీరిలో 2014-15లో 9,539 మందిని నియమించగా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో మిగతా 9951 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని