logo

స్తంభానికి కట్టి.. తల్లిని కొట్టి.. అమానుషంగా ప్రవర్తించిన కుమారుడు

తల్లిదండ్రులు తమ బిడ్డలను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. వారు చిన్నప్పుడు గుండెలపై తంతే మురిసిపోతారు. బుడిబుడి అడుగులు వేస్తుంటే చేయి పట్టి నడిపిస్తారు. వారు పెద్దయ్యాక తమ బాధలు దూరమవుతాయని కలలు కంటారు.

Updated : 26 Dec 2023 08:05 IST

కటక్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు తమ బిడ్డలను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. వారు చిన్నప్పుడు గుండెలపై తంతే మురిసిపోతారు. బుడిబుడి అడుగులు వేస్తుంటే చేయి పట్టి నడిపిస్తారు. వారు పెద్దయ్యాక తమ బాధలు దూరమవుతాయని కలలు కంటారు. అలాగే పెంచి పెద్ద చేసిన కొడుకు అమానుషంగా తల్లిని హింసించిన ఘటన రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేంఝర్‌ జిల్లా నారద్‌పూర్‌లోని శరషపాషి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామంలో సుభద్ర మహంతి (70) భర్త భూతుర తురామ్‌ మహంతి పదేళ్ల కిందట మృతి చెందాడు. దీంతో ఇద్దరు కొడుకులు, కోడళ్లతో కలిసి ఉంటోంది. సుభద్ర పెద్ద కొడుకు కరుణ మహంతి కూడా కొన్నాళ్ల క్రితం మృతి చెందాడు. చిన్న కొడుకు శతృజ్ఞ మహంతి వేరే కాపురం పెట్టాడు. దీంతో సుభద్ర పెద్ద కోడలితో కలిసి వేరే ఇంటిలో ఉంటోంది. చిన్న కుమారుడు తన ఇంటి పేరట్లో క్యాబేజీ సాగు చేశాడు. బుధవారం ఎవరో కొన్ని క్యాబేజీలను దొంగిలించారు. తల్లే దొంగతనం చేసిందని అనుమానించాడు. ఈ విషయమై తల్లిని అడగడంతోపాటు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాలు ఆమెను కొట్టాడు. శనివారం ఆమెను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి విద్యుత్తు స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను స్థానికుల సహాయంతో బాసుదేవ్‌పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె చిన్న కోడలు ఆసుపత్రికి వెళ్లి సుభద్రపై దాడి చేసింది. నర్సులు, వైద్యులు ఆమెను అడ్డుకొని వృద్ధురాలిని రక్షించారు.  వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

నిందితుడి అరెస్టు

తల్లిని విద్యుత్తు స్తంభానికి కట్టి కొట్టిన శతృజ్ఞ మహంతిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా బెయిలు లభించకపోవడంతో కారాగారానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని