logo

అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..

రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది.

Published : 05 May 2024 03:54 IST

నవీన్‌ ఆరోసారి పోటీకి దిగిన స్థానం

 

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది అధికారపీఠాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఆరోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం రెండు దశాబ్దాలకుపైగా బిజద ఖాతాలో చేరింది. 1956 నుంచి 1990 వరకూ వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. మధ్యలో ఒకసారి జనతాదళ్‌, ఆ తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1997లో తండ్రి బిజు పట్నాయక్‌ మరణానంతరం నవీన్‌ పట్నాయక్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1997లో అస్కా లోక్‌సభ ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత తండ్రి పేరిట బిజు జనతాదళ్‌ (బిజద) ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి పగ్గాలు చేపట్టి 2000 సంవత్సరంలో తొలిసారిగా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు.

పోటీలో ప్రత్యర్థులు

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇటీవల హింజిలి, శెరగడ సమితుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయాచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న నవీన్‌ హింజిలి, శెరగడ సమితులు దేశఖ్యాతి గాంచాయన్నారు. ప్రజలంతా మరోసారి శంఖాల గుర్తులపై ఓట్లేసి లోక్‌సభ, అసెంబ్లీ బిజద అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి భాజపా అభ్యర్థిగా శిశిర్‌ మిశ్ర, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రజనీకాంత్‌ పాఢి బరిలోకి దిగారు. వీరితోపాటు ఆప్‌, ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు) తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారన్నది త్వరలో తేలుతుంది. ఆరోసారి గెలుపొంది నవీన్‌ రికార్డు సాధిస్తారని బిజద నాయకులు దీమా వ్యక్తం చేస్తుండగా, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆ ప్రభావం హింజిలిలో ఏ మేరకు ఉంటుందన్నది వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమ గెలుపు నిశ్చయమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని