logo

రాయగడ పీఠం ఎవరికి దక్కేనో?

రాయగడ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఇప్పుడు బిజద పార్టీలకు కంచు కోటగా మారింది. 2019 ఎన్నికల్లో తప్పా బిజద విజయ కేతనం ఎగరవేస్తూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో 50 వసంతాలకుపైగా చక్రం తిప్పి, ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన సీనియర్‌ నాయకుడు నెక్కంటి భాస్కరరావుకు విధానసభ అభ్యర్థిని అనుసూయ మాఝిని గెలిపించుకోవలసిన పరిస్థితి ఎదురైంది.

Published : 06 May 2024 04:07 IST

బిజద.. కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ
రాయగడ, న్యూస్‌టుడే

రాయగడ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఇప్పుడు బిజద పార్టీలకు కంచు కోటగా మారింది. 2019 ఎన్నికల్లో తప్పా బిజద విజయ కేతనం ఎగరవేస్తూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో 50 వసంతాలకుపైగా చక్రం తిప్పి, ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన సీనియర్‌ నాయకుడు నెక్కంటి భాస్కరరావుకు విధానసభ అభ్యర్థిని అనుసూయ మాఝిని గెలిపించుకోవలసిన పరిస్థితి ఎదురైంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా బిజద హవా కొనసాగినా ఇక్కడ మాత్రం బిజద ఓటమి పాలైంది. సీనియర్‌ నాయకుడు లాల్‌ బిహారి హిమిరిక రెండోస్థానానికి పడిపోయారు. అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి మకరంద ముదిలి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన పోటీలో లేకపోయినా పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

తొలిసారిగా మహిళా అభ్యర్థి

రాయగడ శాసనసభ అభ్యర్థినిగా తొలిసారిగా మహిళకు అవకాశం కల్పించి ముఖ్యమంత్రి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని పథకం రూపొందించారు. జిల్లాలో పర్యటించి ఓటర్లలో నూతన ఉత్సాహం నింపారు. 

కాంగ్రెస్‌ పార్టీలో అయోమయం: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సామాజిక కార్యకర్త అప్పలస్వామి కడ్రకకు టికెట్‌ ఇచ్చారు.  పార్టీలో విభేదాలు ఆయన గెలుపును దెబ్బ తీస్తాయేమోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ పర్యటన రద్దు కూడా కొంత వరకు నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బసంత ఉలక : భాజపా అభ్యర్థిగా గిరిజన యువకుడు బసంత ఉలక 2019 ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో  ఈసారి కూడా ఆయనకే అవకాశం లభించింది. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ జరగడంతో కొన్నివర్గాల ఓట్లు భాజపాకు పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ నవరంగపూర్‌, బ్రహ్మపుర ప్రచారాల్లో పాల్గొంటున్నా రాయగడ రాకపోవడం కొంత మేరకు ఇక్కడ కార్యకర్తల్లో అసంతృపి నెలకొందని, ప్రచారం కూడా మందకొడిగా సాగుతోంది. ఇలాంటి సమయంలో బిజద, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరి రాయగడ పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని