logo

నవీన్‌ ఆధిపత్యానికి ఈ సారి అడ్డుకట్ట పడేనా?

గంజాం జిల్లాలో ముఖ్యమంత్రి నవీన్‌ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందా? ఈసారి ఎన్నికల్లో కమల వికాసం జరిగేనా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ బ్రహ్మపురకు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. భాజపాకు కలిసి వస్తుందని, బిజద దూకుడుకు పగ్గాలు పడతాయని భాజపా నేతలు ఆశాభావంతో ఉన్నారు.

Updated : 06 May 2024 07:02 IST

గంజాం జిల్లాలో  కమల వికాసం జరిగేనా?
నేడు బ్రహ్మపురకు ప్రధాని మోదీ రాక
గోపాలపూర్‌, న్యూస్‌టుడే

గంజాం జిల్లాలో ముఖ్యమంత్రి నవీన్‌ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందా? ఈసారి ఎన్నికల్లో కమల వికాసం జరిగేనా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ బ్రహ్మపురకు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. భాజపాకు కలిసి వస్తుందని, బిజద దూకుడుకు పగ్గాలు పడతాయని భాజపా నేతలు ఆశాభావంతో ఉన్నారు.

1996లో పీవీ వచ్చారు

1996లో నాటి ప్రధాని (దివంగత) పి.వి.నరసింహారావు గోపాల్‌పూర్‌ వచ్చారు. అప్పట్లో టాటా స్టీల్‌ ఉక్కు కర్మాగారం నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటును నిర్వాసితులు వ్యతిరేకించడంతో పనులు నిలిచిపోయాయి. స్థల సేకరణ జరిగినా పరిశ్రమ నిర్మాణం జాజ్‌పూర్‌ జిల్లా కళింగనగర్‌కు తరలిపోయింది. అనంతరం టాటా స్థలాలకు ప్రత్యేక ఆర్థిక జోన్‌ (సెజ్‌) హోదా దక్కింది. ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. పీవీ తర్వాత ప్రధాని హోదాలో మోదీ బ్రహ్మపుర వస్తున్నారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించనున్న ఆయన రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా గుర్తింపు పొందిన గంజాం గురించి ఏం చెబుతారన్నదానిపై ప్రజలందరిలో ఉత్కంఠ ఉంది.

నీటి పారుదల అంతంత మాత్రం

బిజద హయాంలో ఏదీ ప్రగతి?

గంజాం జిల్లా అస్కా లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికైన నవీన్‌ పట్నాయక్‌ అటల్‌బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో ఉక్కుగనుల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2000లో ఆయన గంజాం జిల్లా హింజిలి నుంచి అసెంబ్లీకి ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా అయిదుసార్లు సీఎం అయిన నవీన్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చేసిందేమీ లేదన్న అసంతృప్తి జిల్లాలో ఉంది. యువతలో ఇది బలంగా ఉంది. ఉపాధి అవకాశాలు లేక ఈ జిల్లావాసులు వలస పోతున్నారు. సూరత్‌ (గుజరాత్‌)లో ఈ జిల్లాకు చెందిన ప్రజలు 3 లక్షల మంది ఉన్నారు. మరో రెండు లక్షల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హింజిలిలో వలసలు ఎక్కువ. జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి బిజద తీసుకున్న చర్యలు కూడా లేవు. నదులు పుష్కలంగా ఉన్నా సాగునీటి కల్పన లేదు.

జిల్లా నుంచి వలసపోతున్న కార్మికులు


ఆదరిస్తున్న ఓటర్లు

నవీన్‌ హయాంలో జిల్లా ప్రగతి రథచక్రాలు పరుగులు తీస్తాయన్న ఆశలు పెంచుకున్న జిల్లా వాసులు బిజదను ప్రతిసారి ఎన్నికల్లో ఆదరిస్తున్నారు. 2019లో బ్రహ్మపుర, అస్కా లోక్‌సభ, వాటి పరిధుల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో బిజద అభ్యర్థులను గెలిపించారు. జిల్లా నుంచి ఎన్నికైన నవీన్‌ అయిదోసారి సీఎం కాగా బిక్రంకేసరి అరుఖ్‌, ఉషాదేవి, ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రహి కేబినెట్‌ మంత్రులుగా విధులు నిర్వహించారు. గతసారి ఎన్నికల్లో భాజపా జిల్లాలో ఖాతా తెరవలేకపోయింది. ఈసారి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 13, 20 తేదీల్లో బ్రహ్మపుర, అస్కా లోక్‌సభ, వాటి పరిధుల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీకి ఈ జిల్లా గురించి తెలుసు. అభివృద్ధికి అవకాశాలున్నా బిజద పాలకులు ఏమీ చేయలేకపోయారని తెలిసిన ఆయన ఎలా స్పందిస్తారు? ఓటర్లకు ఏం సందేశమిస్తారన్న దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మార్పు తథ్యమంటున్న నేతలు

గంజాం జిల్లా భాజపా అధ్యక్షుడు సుభాష్‌సాహు ఆదివారం కొణిసిలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ పర్యటన పార్టీకి లాభిస్తుందని, ఓటరు చైతన్యానికి బాటలు పడతాయన్నారు. గోపాల్‌పూర్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు పొంచు బెహరా ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... గంజాం జిల్లాలో మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆయన గ్యారంటీని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని