logo

సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయం

సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయమని, చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పరని, అందుకు ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు.

Published : 07 May 2024 01:28 IST

ముఖ్యమంత్రి అద్దాల మేడలో ఉన్నారు: నడ్డా

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నడ్డా,  పాల్గొన పాత్రికేయులు, విభిన్నరంగాల ప్రముఖులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయమని, చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పరని, అందుకు ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఆదివారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అద్దాల మేడలో ఉంటున్నారని, జనానికి దూరంగా ఉన్న ఆయనకు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియదన్నారు. అధికారుల పాలన ప్రజలకు శాపంగా పరిణమించిందని, ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు.

అవాస్తవాలు చెబుతున్న బిజద

ఓటమి భయంతో బిజద నాయకత్వం అవాస్తవాలు చెబుతోందని, విశ్వసనీయత కోల్పోయిందన్నారు. భాజపా ఈసారి విపక్ష స్థానంలో కూర్చోవడానికి పోటీ చేయడం లేదని, అధికారంలోకి వచ్చి ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలించాలని కృతనిశ్చయంతో ఉందన్నారు.

మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌

భాజపా మేనిఫెస్టోను ఆషామాషీగా తీసుకోవడం లేదని, దీన్ని విజన్‌ డాక్యుమెంట్‌గా భాజపా పరిగణిస్తోందన్నారు. చెప్పినవి అమలు జరిగాయా? అన్నదానిపై ఒక సంఘం ఉంటుందని అది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందన్నారు. రాజకీయాలు అభివృద్ధికి, ప్రజలు సంక్షేమానికి అద్దం పట్టాలన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న పార్టీలు విశ్వసనీయత కోల్పోతున్నాయన్నారు.

శ్రీక్షేత్రం లోపాలు చక్కదిద్దుతాం

విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం కోట్లాది మంది భక్తుల మనోభావాలు భక్తి ప్రవృత్తులకు ప్రతీక కాగా పాలనా లోపాల వల్ల అవినీతి జరుగుతోందన్నారు. జగన్నాథుని సన్నిధికి వస్తున్న వారంతా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చేసి, భక్తులందరికీ దివ్యానుభూతి కల్పించడం భాజపా ధ్యేయమని నడ్డా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని