logo

రాష్ట్రానికి నా హయాంలో రూ.మూడున్నర లక్షల కోట్ల సాయం

తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒడిశా రాష్ట్రానికి రూ.మూడున్నర లక్షల కోట్లు సాయంగా అందించినట్లు నరేంద్రమోదీ వివరించారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ హయాంలో రూ. లక్ష కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు.

Published : 07 May 2024 01:36 IST

పర్యాటక హబ్‌గా గంజాం జిల్లా
యువత ఉపాధికి హామీ
బ్రహ్మపుర ఎన్నికల సభలో ప్రధాని మోదీ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒడిశా రాష్ట్రానికి రూ.మూడున్నర లక్షల కోట్లు సాయంగా అందించినట్లు నరేంద్రమోదీ వివరించారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ హయాంలో రూ. లక్ష కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు బ్రహ్మపుర పరిధిలోని గోపాల్‌పూర్‌ అసెంబ్లీ కొణిసిలో జరిగిన భాజపా విజయ సంకల్ప ఎన్నికల సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హింజిలి మంచినీటి ఎద్దడి, వలసలకు చిరునామా అయిందన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంతో మంది సూరత్‌లో ఉన్నారని, వారంతా నైపుణ్యంగల కార్మికులని పేర్కొన్న ప్రధాని వలసలు నివారించడానికి శాశ్వత కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని రానున్న అయిదేళ్లలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా చేయడానికి తాను గ్యారంటీ ఇస్తున్నానన్నారు.

ప్రధాని మోదీకు బ్రహ్మపుర పెద్దమ్మవారు చిత్రపటం అందిస్తున్న లోక్‌సభ అభ్యర్థి పాణిగ్రహి. చిత్రంలో పార్టీ నేతలు

మేనిఫెస్టోకి  మోదీ గ్యారంటీ

రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దం పట్టే మేనిఫెస్టో భాజపా ప్రకటించిందని, దీనికి మోదీ గ్యారంటీ ఉందన్నారు. మహిళలు, యువత, కార్మికులు, అన్నదాతల ప్రగతి ధ్యేయంగా కార్యక్రమాలు అమలు చేయించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. బిజద ప్రభుత్వం మోకాలడ్డిన ఆయుష్మాన్‌భారత్‌, గర్భిణుల ప్రయోజనాలకు అద్దం పట్టే రూ.6 వేలు నగదు పంపిణీ తదితర కార్యక్రమాలు భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలవుతాయన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలు నెరవేరుస్తామని, గంజాం జిల్లాను జాతీయ స్థాయిలో ‘పర్యాటక హబ్‌’ గా తీర్చిదిద్ది యువత ఉపాధికి గ్యారంటీ ఇస్తున్నామన్నారు. 25 లక్షల మంది మహిళల్ని ‘లక్షపతి దీదీ’లుగా చేస్తామన్నారు.

అభ్యర్థులతో కలిసి మోదీ అభివాదం

ఏదీ ప్రగతి?

అయోధ్యలో రామాలయం నిర్మాణం ఎవరు చేయించారని ప్రధాని ప్రశ్నించారు. మోదీ అని సభకు వచ్చినవారు చెప్పడంతో వారంతా తప్పు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వేసిన ఓటుతో ఈ మహత్కార్యం జరిగిందని, 500 ఏళ్లుగా నలిగిన సమస్య పరిష్కారమైందన్నారు. ఒడిశాను 50 ఏళ్లు కాంగ్రెస్‌, 25 ఏళ్లు బిజద పాలించాయని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయన్నారు. ఖనిజ సంపద, ప్రకృతి ప్రసాదించిన వనరులకు నిలయమైన రాష్ట్రం పేదరికానికి చిరునామా అయిందన్నారు.

సభకు హాజరైన అభిమానులు, కార్యకర్తలు

ఒడియాలో ఉత్తరాలు

మోదీ అభిమానులెంతో మంది తాము గీసిన చిత్రాలు, కళాకృతులు సమావేశానికి తెచ్చారు. ప్రధానికి ఇవ్వాలని ఆరాట పడ్డారు. వేదికపై ఉన్న ఆయన దీన్ని తిలకించి వాటిని తీసుకోవాలని ఎస్పీజీ జవానులకు ప్రధాని మోదీ ఆదేశించారు. ఆయా చిత్రాలు, కళాకృతుల వెనుక తెచ్చినవారు తమపేరు, వివరాలు రాయాలని సూచించారు. తాను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒడియాలో లేఖలు రాస్తానని, ఒడిశా ముఖ్యమంత్రిలా తాను కాదని పరోక్షంగా నవీన్‌కు ఒడియా రాని వ్యక్తిగా మోదీ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని